ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆది,సోమవారాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
బచ్చన్నపేట : బైక్ అదుపు తప్పి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో జరిగింది. పోలీసులు, కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెక్క కనుకయ్య (45) తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆదివారం హమాలీ పని కోసం బైక్‌పై గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు 108లో వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య కళ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
ముల్కనూరులో గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి..
భీమదేవరపల్లి: గుర్తు తెలియని వాహ నం ఢీకొని మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గంప రమేశ్(55) రోజుమాదిరిగానే సోమవారం ఉదయం వాకింగ్ వెళ్లాడు. అయితే ఓ గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య వసంత, కుమారుడు రోహిత్ ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ట్రాక్టర్ ఢీకొని రాజుపల్లిలో ఉపాధి హామీ కూలీ..
శాయంపేట : బైక్‌ను ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ ఉపాధి హామీ కూలీ మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చింతనిప్పుల రాధమ్మ (45) రోజు మాదిరిగానే ఉపాధి హామీ పనులకు వెళ్లింది. అనంతరం అదే గ్రామానికి చెందిన చింతం బుచ్చయ్య బైక్‌పై ఇంటికి వస్తోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పంచనేని దేవేందర్ రావు ట్రాక్టర్‌పై వస్తున్నాడు. ట్రాక్టర్ అదుపుతప్పి బైక్‌ను ఢీకొనడంతో రాధమ్మ కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పరకాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


