చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

చిన్నారితో కలిసి వివాహిత ఆత్మహత్యాయత్నం

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

కాపాడిన వాకర్స్‌ సభ్యులు

పోలీసులకు అప్పగింత

కాజీపేట: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత తన రెండేళ్ల వయసున్న కూతురుతో కలిసి వడ్డేపల్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించగా వాకర్స్‌ సభ్యులు చూసి కాపాడారు. ప్రత్యక్షుల కథనం ప్రకారం.. కాజీపేట 63వ డివిజన్‌ జూబ్లీ మార్కెట్‌ ప్రాంతానికి చెందిన రాజ్యలక్ష్మి (30) సోమవారం ఉదయం ఇంట్లో గొడవ జరగడంతో తన కూతురును తీసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి వడ్డేపల్లి చెరువు వద్దకు చేరుకుంది. చెరువులోకి దిగుతున్న సమయంలో వాకింగ్‌ చేస్తూ అటుగా వచ్చిన కురుమని మహేందర్‌ రెడ్డి ప్రమాదాన్ని పసిగట్టి అప్రమత్తమయ్యారు. వెంటనే సమీపంలో ఉన్న సహచర వాకర్ల సహకారంతో బాధితురాలిని బయటకు తీసుకొచ్చి ధైర్యం చెప్పారు. అనంతరం పోలీసులకు అప్పగించగా వారు కుటుంబీకులను పిలిచి కౌన్సెలింగ్‌ నిర్వహించి పంపించారు. తల్లీకూతుళ్లను కాపాడిన వాకర్స్‌ సభ్యులను సీఐ సుధాకర్‌ రెడ్డి అభినందించారు.

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

బచ్చన్నపేట : జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురం గ్రామంలో ఈతకెళ్లి గల్లంతైన చీర కరుణాకర్‌(30) మృతదేహం లభ్యమైంది. ఆదివారం గ్రామంలోని తుమ్మలబావిలో ఈత కొట్టడానికి వెళ్లిన కరుణాకర్‌ అదే బావిలో మునిగిపోయిన విషయం విధితమే. సాయంత్రం సమయంలో గజ ఈతగాళ్లతో వెతికినా ఫలితం లేదు. దీంతో ఎస్సై శ్రీకాంత్‌ ఆ బావికి మోటార్లు బిగించి నీటిని తోడగా సోమవారం ఉదయం మృతదేహం లభ్యమైంది.కాగా, ఆరు నెలల క్రితం మృతుడి భార్య చనిపోగా ట్రాలీ ఆటో నడుపుకుంటూ జీవించే కరుణాకర్‌ కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

కుంటలో పడి వృద్ధురాలి మృతి

కొడకండ్ల : జనగామ జిల్లా కొడకండ్ల మండలకేంద్రానికి చెందిన అనంతోజు గోవిందమ్మ(70) మాలకుంటలో పడి మృతి చెందింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గోవిందమ్మ బహిర్భుమికి వెళ్లి రాకపోవడంతో కుటుంబీకులు రాత్రంతా వెతికినా ఆచూకి లభించలేదు. సోమవారం మాలకుంట వైపు వెళ్లిన స్థానికులు మృతదేహం కనిపించడంతో కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో వారు వెళ్లి చూసి నీటిలో పడి మృతి చెందింది గోవిందమ్మేనని గుర్తించారు. మృతురాలి కూతురు జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చింత రాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement