● ఇద్దరు యువకుల దుర్మరణం
మామునూరు: బైక్‌ను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందిన సంఘటన ఆదివారం అర్ధరాత్రి వరంగల్ నక్కపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన కనిగిరి వెంకటరత్నం తన కుటుంబ సమేతంగా జగిత్యాల జిల్లా పెగడపల్లికి వలస వచ్చాడు. కుమారులు విష్ణువర్ధన్ (22), శేషయ్య (21)తో కలిసి ఆయన మేసీ్త్ర పనిచేస్తూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండలో ఉన్న పెద్దనాన్న కుమారుడిని చూసేందుకు ఆదివారం సాయంత్రం విష్ణువర్ధన్, శేషయ్య బైక్‌పై పెగడపల్లి నుంచి బయలుదేరారు. ఈక్రమంలో వరంగల్‌కు అర్ధరాత్రి చేరుకున్నారు. అన్న మరో అరగంటలో నెక్కొండకు చేరుతాం.. టీతాగుతూ సంతోషంగా ఫోన్‌లో మాట్లాడారు. నెక్కొండ రోడ్డు నక్కలపల్లి గ్రామ శివారుకు చేరుకున్నారు. అంతలోనే నెక్కొండ వైపు నుంచి వరంగల్‌కు వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ ముక్కలైంది. విష్ణువర్ధన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శేషయ్యను పోలీసులు క్షణాల్లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇద్దరి మృతితో పెగడపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఘటన స్థలానికి మామునూరు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ చేరుకున్నారు. ఘోర రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించారు. విష్ణువర్ధన్ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి కనిగిరి వెంకటరత్నం ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.


