సంక్షేమ పథకాలు పక్కాగా అమలుచేయాలి
● జెడ్పీ సీఈఓ పురుషోత్తం
తొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలని జెడ్పీ సీఈఓ పురుషోత్తం అధికారులకు సూచించారు డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో జరుగుతున్న జాతీయ ఉపాధిహామీ పనులు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ఇతర సంక్షేమ పథకాల అమలు తీరుపై ఎంపీడీఓ వెంకటేశ్వర్లుతో చర్చించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడారు. గ్రామాల్లో సంక్షేమ పథకాల అమలు పారదర్శకంగా జరగాలని, అర్హులకు పథకాలు అందిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి అభివృద్ధి కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పర్చాలని, అధికారులు నిత్యం గ్రామాలను సందర్శించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, లబ్ధిదారులకు విడతల వారీగా బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ పూర్ణచందర్ రెడ్డి, ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, సిబ్బంది పాల్గొన్నారు.


