
ఇద్దరు పిల్లలను సాకేదెట్లా..?
మరిపెడ రూరల్: పేద కుటుంబంపై విధి పగబట్టింది. రెక్కల కష్టంపై ఆధారపడిన కుటుంబ పెద్దను అనారోగ్యం రూపంలో కబలించింది. ఫలితంగా భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వారిగా మారి రోడ్డున పడ్డారు. కనీసం తిండి గింజలు కూడా లేని దుస్థితి. భర్త అంత్యక్రియలు, దశదిన కర్మలకు గ్రామస్తులే సహకరించారు. అయితే ఇప్పడు ఆ ఇద్దరు పిల్లలను సాకేదెట్లా అంటూ తల్లి భ్రమనంబ గుండెలవిసేలా రోదిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లెపల్లి గ్రామానికి చెందిన చిదుముల వీరన్న, భ్రమనంబ దంపతులు నిరుపేదలు. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పి ల్లలు రక్షిత్, బ్లెస్సి సంతానం( పది సంవత్సరాల లోపు). ఈ క్రమంలో వీరన్నకు నెల క్రితం విషజ్వరం సోకింది. దీంతో చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులు ఆశ్రయించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి రెక్కల కష్టం ద్వారా దాచుకున్న రూ. 50 వేలతోపాటు కొంత అప్పు చేసి భర్త చికిత్సకు ఖర్చు చేసింది. అయినా విష జ్వరం కారణంగా వీరన్నకు కామెర్లు సోకి గత నెల 23వ తేదీన మృతి చెందాడు. వీరన్న అంత్యక్రియలకు కూడా ఇంట్లో చిల్లి గవ్వలేదు. దీంతో ఆ కుటుంబ దీన స్థితి చూసి చలించిన గ్రామస్తులు ముందుకొచ్చి దాహన సంస్కారాలతోపాటు దశదిన కర్మలకు సహకారం అందించారు. నిరుపేద కుటుంబ కావడంతో వీరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. అయితే పూట గడవని పరిస్థితుల్లో ఆ ఇంటిని నిర్మించుకోలేని దుస్థితిలో ఉంది ఆ కుటుంబం. గ్రామస్తుల సాయంతో ( ఆర్థిక, నిత్యావసరాలు) భ్రమనంబ ప్రస్తుతం కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. తన ఇద్దరు పిల్లలను సాకేదెలా అని కన్నీటి పర్యాంతమవుతోంది. దీనిపై దాతలు స్పందించి ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని భ్రమనంబతోపాటు గ్రామస్తులు వేడుకుంటున్నారు.
నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం అందించే దాతలు
88973–90368 నంబర్‌ను సంప్రదించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇంటి పెద్దను కోల్పోయిన నిరుపేద కుటుంబం
దిక్కు లేనివారైన భార్య, ఇద్దరు పిల్లలు
రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ..
మంజూరైన ఇందిరమ్మ
ఇంటిని కూడా నిర్మించుకోని దుస్థితి..
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

ఇద్దరు పిల్లలను సాకేదెట్లా..?

ఇద్దరు పిల్లలను సాకేదెట్లా..?