
కన్యాదానం చేసిన 48 గంటల్లోనే నవవధువు తండ్రి మృతి
బయ్యారం: బిడ్డకు వేదమంత్రాల నడుమ కన్యాదానం చేసిన తండ్రి 48 గంటల వ్యవధిలో కాలంచేసి ఆ కుటుంబంలో విషాదం నింపాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లిలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన జంగిలి సతీష్(46)– శోభ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె వివాహం కొన్నేళ్ల క్రితం జరగగా, చిన్నకుమార్తె అక్షయ వివాహం ఆదివారం నిర్వహించారు. పెళ్లి పూర్తయిన తర్వాత రెండురోజులుగా సతీష్ స్థానికంగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బ తగలడంతో వాంతులు, విరోచనాలవుతున్నాయి. స్థానికంగా వైద్యం చేయించినప్పటికీ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.