
వడదెబ్బతో పారిశుద్ధ్య కార్మికుడి మృతి
కాటారం: సరస్వతీనది పుష్కరాల్లో భాగంగా విధులు నిర్వర్తిస్తూ ఓ పారిశుద్ధ్య కార్మికుడు వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబీకుల కథనం ప్రకారం.. కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన జీపీ పారిశుద్ధ్య కార్మికుడు మంతెన శ్రీనివాస్(35) ఈ నెల 15 నుంచి నాలుగు రోజుల పాటు కాళేశ్వరంలో పుష్కరాల విధులు నిర్వర్తించాడు. పనులు చేస్తూ ఆదివారం ఎండతీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అధికారులు కాళేశ్వరంలోని వైద్య శిబిరంలో ప్రథమ చికిత్స చేయించి ఇంటికి పంపించారు. అయితే పరిస్థితి విషమించి సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు.