
నిబంధనలు ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు
నెహ్రూసెంటర్: ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు జారీతో పాటు అనుమతులను రద్దు చేస్తామని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ హెచ్చరించారు. వైద్యారోగ్యశాఖ అధికారులు సోమవారం జిల్లా కేంద్రంలోని పలు ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. వైద్యారోగ్యశాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆస్పత్రి భవనాల్లో ఫైర్‌సేఫ్టీ అనుమతులు తీసుకోవాలని, బయో మెడికల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్టు నుంచి సర్టిఫికెట్లు విధిగా తీసుకోవాలని సూచించారు. స్కానింగ్ సెంటర్‌లో అనుమతి పొందిన రేడియోలాజిస్టులు, గైనకాలజిస్టులు మాత్రమే గర్భిణులకు స్కానింగ్‌లు చేయాలని, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలు అందించే వైద్య సేవలకు సంబంధించిన రుసుము వివరాలను ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేయాలని చెప్పారు. తనిఖీల్లో ప్రోగ్రాం అధికారి సారంగం, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెచ్‌ఈఓ లోక్య, ఎల్‌డీ కంప్యూటర్ అరుణ్, మనోహర్, సీసీ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్