
రూ.2.8 లక్షల సైబర్ లూటీ
డోర్నకల్: సైబర్ వలలో పడి ఓ యువతి రూ.2.8 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. డోర్నకల్ సీఐ బి.రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. బొడ్రాయితండాకు చెందిన గుగులోత్ మౌనిక ఏప్రిల్ 8న ఇన్‌స్ర్ట్రాగామ్‌లో లోన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంది. లోన్‌యాప్ ప్రతినిధి రూ.10 లక్షల లోన్ మంజూరు చేస్తామని మొదట రూ.11 వేల పంపాలని కోరగా మౌనిక పంపింది. తర్వత మరో రూ.20వేలు పంపమని కోరడంతో మళ్లీ పంపించింది. లోన్ యాప్ ప్రతినిధి వారం రోజులపాటు మౌనికకు మాయమాటలు చెబుతూ రూ.2.8 లక్షలు లూటీ చేశాడు. అనంతరం యాప్ ప్రతినిధి స్పందించకపోవడంతో మౌనిక డోర్నకల్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మౌనిక ఖాతా నుంచి బదిలీ అయిన డబ్బులో రూ.7 వేలను హోల్డ్‌లో పెట్టారు. మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు సీఐ తెలిపారు.
రుణం ఇప్పిస్తామని మోసం..
మహబూబాబాద్ రూరల్ : రుణం ఇప్పిస్తామని చెప్పిన ప్రకటనను నమ్మిన ఓ యువకుడు డబ్బులు బదిలీ చేయగా సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. రూరల్ ఎస్సై దీపిక తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ఈదులపూసపల్లికి చెందిన ఆకుల యుగంధర్ ఫేస్ బుక్ ఖాతాకు జనవరిలో ధని యాప్ పేరిట రుణం ఇస్తామని సమాచారం వచ్చింది. దీంతో యుగంధర్ అవతలి వ్యక్తులు పంపించిన లింక్ ఓపెన్ చేశాడు. అనంతరం అవతలి వ్యక్తులు కోరినవిధంగా రూ.3వేలు, రూ.11,300, రూ.8,800, రూ.13,500 విడతల వారీగా పంపించాడు. డబ్బులు తిరిగి రాకపోవడంతో మాసానికి గురైనట్లు గ్రహించి 1930లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు.