
అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి
● కలెక్టర్ రాహుల్ శర్మ
కాళేశ్వరం : సరస్వతీనది పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం కాళేశ్వరం దేవస్థానంలోని కల్యాణ మండపంలో విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు రోజూ సుమారు లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతీ అధికారి తమకు కేటాయించిన లోకేషన్లలో మందస్తు పర్యటించి ఏర్పాట్లు పరిశీలించాలని తెలిపారు. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పుష్కరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఈ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఘాట్ల వద్ద 50 మంది గజ ఈతగాళ్లు నాటు పడవలతో పహారా కాస్తున్నట్లు తెలిపారు. తాత్కాలిక బస్టాండ్ నుంచి బస్టాండ్ వరకు భక్తుల సౌకర్యార్థం ఉచితంగా 30 షటిల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. విధులు కేటాయించిన అధికారులు ఎవరైనా గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకటరావు, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, ఆర్‌డీఓ రవి, తదితరులు పాల్గొన్నారు.