
పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు
కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ తెలిపారు. బుధవారం కాళేశ్వరంలో సరస్వతీ ఘాట్ వద్ద ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు (గురువారం) సీఎం రేవంత్ రెడ్డి సరస్వతీమాతా విగ్రహం, ఘాట్ ప్రారంభోత్సవం చేస్తారన్నారు. అనంతరం పుష్కర స్నానమాచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తర్వాత త్రివేణి సంగమంలో మొదటిసారి కాశీ పండితులు నిర్వహించనున్న నదీ హారతిలో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి పెద్ద ఎత్తున సరస్వతీనది పుష్కరాలు నిర్వహిస్తున్నామని, జిల్లా యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్