
పుష్కరాలకు పటిష్ట భద్రత
● ఎస్పీ కిరణ్ ఖరే
కాళేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26తేదీ వరకు జరుగనున్న సరస్వతీనది పుష్కరాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. ఈ మేరకు సోమవారం కాళేశ్వరంలోని పుష్కర ఘాట్‌లతోపాటు పోలీసు భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరస్వతీనది పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రానున్నట్లు పేర్కొన్నారు. సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ పోలీసులతో సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు.
మూడు షిఫ్టుల్లో 3,500 పోలీసుల విధులు..
పుష్కరాల సందర్భంగా మల్టీజోన్ –1 నుంచి సుమారు 3,500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తారని ఎస్పీ తెలిపారు. 200 సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసి భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. 14 పార్కింగ్ స్థలాలు,7 హోల్డింగ్ పాయింట్స్ పార్కింగ్ స్థలాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. పుష్కరాల్లో మహిళలు, పిల్లల రక్షణకు ప్రత్యేక మహిళా పోలీసు విభాగంతో పాటు, ‘షీ’ టీమ్స్ పనిచేస్తాయని తెలిపారు.
వాహనాల మళ్లింపు ఇలా..
పుష్కరాల వచ్చే భక్తుల వాహనాలను నిర్దేశించిన స్థలాల్లో పార్క్ చేసేలా పలు మళ్లింపులు చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్, వరంగల్ నుంచి వచ్చే వాహనాలు కాటారం నుంచి పలుగుల క్రాస్ మీదుగా కాళేశ్వరం చేరుకోవాలని, కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు మంథని, గంగారం క్రాస్, పలుగుల క్రాస్ మీదుగా కాళేశ్వరం రావాలని, అలాగే, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల నుంచి వచ్చే వాహనాలు సిరొంచ అంతర్రాష్ట్ర వంతెన నుంచి కాళేశ్వరం చేరుకోవాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం ఉచిత షటిల్ బస్‌లు నడపనున్నారని తెలిపారు. ఘాట్ల వద్ద భక్తులకు ప్రమాదాలు జరగకుండా ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి, రెస్క్యూ టీంలు, పోలీసులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ బోనాల కిషన్, కాటారం, భూపాలపల్లి డీఎస్పీలు రామ్మోహన్ రెడ్డి, సంపత్ రావు, నారాయణ నాయక్, మహదేవపూర్ సీఐలు రామచందర్ రావు, నాగార్జున రావు, నరేశ్, కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.