
ఆర్టీసీ బస్సులో బంగారం చోరీ..
రఘునాథపల్లి: ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలి హ్యాండ్ బ్యాగు నుంచి పదమూడున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యా యి. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. పో లీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన చిత్తలూరి మమత ప్రస్తుతం మెదక్ జిల్లా తూప్రాన్‌లో ప్రైవేట్ టీచర్‌గా పని చేస్తోంది. హనుమకొండలో సోదరుడి వద్ద ఉన్న కుమారుడు, కూతురును తీసుకొచ్చేందుకు తూప్రాన్ నుంచి బస్సులో గజ్వేల్‌కు.. అక్కడి నుంచి భువనగిరి చేరుకుని, మరో బస్సులో జనగామకు చేరుకుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు హనుమకొండ వెళ్లేందుకు జనగామ బస్టాండ్‌లో హనుమకొండ డిపోనకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఎక్కింది. రఘునాథపల్లి వచ్చాక హ్యాండ్ బ్యాగు జిప్ తెరిచి ఉండడంతో లోపల చూసింది. ఇందులో ఉన్న పదమూడున్నర తులాల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ అయినట్లు గుర్తించింది. ఈ విషయం కండక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, డ్రైవర్ రాము దృష్టికి తీసుకెళ్లడంతో వారు నేరుగా బస్సును రఘునాథపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయగా ఆభరణాలు లభించలేదు. జనగామ బస్టాండ్‌లో, ఆయా గ్రామాల్లోని సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు.
హ్యాండ్ బ్యాగు నుంచి
పదమూడున్నర తులాలు మాయం
లబోదిబోమంటున్న బాధితురాలు
పోలీసులకు ఫిర్యాదు