
వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి..?
హన్మకొండ చౌరస్తా : వైద్యుల నిర్లక్ష్యంతోనే రోగి మృతి చెందాడంటూ ఆస్పత్రి ఎదుట రోగి బంధువులు సోమవారం ఆందోళన చేపట్టారు. మృతుడి బంధువులు తెలిపిన కథనం ప్రకారం.. వరంగల్ రంగశాయిపేటకు చెందిన మహేందర్‌రావు కడుపునొప్పితో బాధపడుతూ ఆదివారం హనుమకొండలోని బంధన్ ఆస్పత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యులు అడ్మిట్ చేసుకుని చికిత్స ప్రారంభించారు. రాత్రి వరకు బాగానే ఉన్నాడని చెప్పిన వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యం, సోమవారం ఉదయం మహేందర్‌రావు చనిపోయినట్లు వెల్లడించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిపుణులైన వైద్యులు చికిత్స చేయకుండా ఫార్మాడీ, బీఎంఎంస్ వైద్యులు చికిత్స చేయడంతోనే మృతి చెందాడని బంధువులు చెబుతున్నారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కొందరి మధ్యవర్తిత్వంతో మృతుడు కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం చెల్లిస్తామన్న హామీతో గొడవ సద్దుమణిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో బంధన్ ఆస్పత్రి వద్ద జరుగుతున్న ఆందోళనను గుర్తించిన డీఎంహెచ్‌ఓ అప్పయ్య ఆస్పత్రిని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేస్‌షీట్స్‌ను హనుమకొండ పోలీసులు తీసుకెళ్లడంతో పూర్తి చికిత్స వివరాలు తెలియాల్సి ఉందన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగిందని, వైద్యసేవల పట్ల అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని ఆస్పత్రి యాజమాన్యాన్ని హెచ్చరించారు.
ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
విచారణ చేపట్టిన డీఎంహెచ్‌ఓ