
బయ్యారం పెద్దచెరువుపై చిన్నచూపు
బయ్యారం: కాకతీయుల కాలంలో నిర్మించిన బయ్యారం పెద్ద చెరువుపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. బయ్యారం, గార్ల మండలాలకు కల్పతరువుగా ఉన్న చెరువుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించాలని ముందు ప్రతిపాదనలు చేసిన ప్రజాప్రతినిధులు.. తర్వాత డిజైన్‌మార్చి ఇక్కడి రైతులకు అన్యాయం చేస్తున్నారు.
డిజైన్ మార్చి అన్యాయం..
బీఆర్‌ఎస్ పాలనలో అప్పటి సీఎం కేసీఆర్ సీతారామప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడులో నిర్వహించిన బహిరంగసభలో కాల్వల డిజైన్‌ను ప్రజల సాక్షిగా ప్రకటించారు. ఆ డిజైన్ ప్రకారం రోళ్లపాడు చెరువులోకి వచ్చే గోదావరి జలాలను అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా బయ్యారం పెద్దచెరువులోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఆ తర్వాత బయ్యారం పెద్దచెరువును రిజర్వాయర్‌గా మార్చి ఇక్కడి నుంచి జిల్లాలోని కురవి, డోర్నకల్ మండలాల మీదుగా ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని ప్రకటించారు. అయితే ఆ సమయంలో పాలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తన పలుకుబడిని ఉపయోగించి బయ్యారం చెరువుకు నీరు రాకుండా డిజైన్‌ను మార్చి అన్యాయం చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల ముందు హామీలు ఇచ్చినా..
గత సాధారణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యనాయకులు బయ్యారం పెద్దచెరువుకు గోదావరి నీటిని తీసుకొస్తామని ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారం పెద్దచెరువుకు సీతారామ ప్రాజెక్ట్‌కు బదులు దేవాదుల నీటిని తీసుకొచ్చేందుకు ఇరిగేషన్ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. అయితే ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదని రైతులు పేర్కొంటున్నారు.
స్పష్టత కోసం ఎదురుచూపులు..
కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతర్భాగంగా ఉన్న బయ్యారం, గార్ల మండలాల నుంచి ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసనమండలి సభ్యుడిగా కొనసాగారు. ఇలా ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉండడంతో బయ్యారం పెద్దచెరువు అభివృద్ధి విషయంపై తన పర్యటన ద్వారా స్పష్టత వస్తుందా అని బయ్యారం, గార్ల మండలాల రైతులు ఎదురుచూస్తున్నారు.
నేడు పర్యటన..
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం పర్యటించనున్నారు. రోడ్డు మార్గం ద్వారా వచ్చి లక్ష్మినర్సింహపురంలో విద్యుత్ ఉపకేంద్రం, బ్రిడ్జి నిర్మాణపనులు, గంధంపల్లి–కొత్తపేటలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహ ఆవిష్కరణ, రామచంద్రాపురం, కొమ్మవరంలో విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటు పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత భద్రాద్రి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన కొనసాగనుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
సీతారామ ప్రాజెక్టు
జలాలు రాకుండా అడ్డగింత
డిజైన్ మార్చడంతో బయ్యారం,
గార్ల మండలాల రైతుల్లో ఆందోళన
నేడు మండలంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క
చెరువు నీటివనరుపై స్పష్టత ఇచ్చేనా..