
ప్రయాణికుల అవసరాలను గుర్తిస్తాం
మహబూబాబాద్ రూరల్: ప్రయాణికుల అవసరాల మేరకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. పనుల వివరాలను రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ కనకరాజును అడిగి తెలుసుకున్నారు. రైల్వే నాల్గో ప్లాట్ ఫారం నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరగా.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రయాణికుల అవసరాల మేరకు పలు రైళ్లు నిలుపుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ బాధ్యులు హుస్సేన్‌నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. వందేభారత్, జీటీ, ఏపీ, తమిళనాడు, గరీబ్‌రథ్, ఎల్‌టీటీ, సంఘమిత్ర రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. రామచంద్రరావు, శ్యాంసుందర్ శర్మ, అశోక్, గంగాధర్‌నాథ్, అజయ్, సందీప్, రాంబాబు, నరేష్, ప్రేమ్ రాయుడు, రామకృష్ణ, రాంబాబు, పద్మ, వెంకన్న పాల్గొన్నారు.
పోడు భూములకు పట్టాలు మంజూరు చేయండి..
గూడూరు: ఏజెన్సీ ప్రాంతంలోని పోడు రైతులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఇప్పించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్‌నాయక్ ఫారెస్టు అధికారులను కోరారు. మండలంలోని గుండెంగలో పోడు రైతుల ఫిర్యాదు మేరకు సోమవారం ఆయన వారి భూములను సందర్శించారు. గిరిజన రైతులు తమ సమస్యలను హుస్సేన్‌నాయక్‌కు చెప్పుకున్నారు. గుండెంగ జీపీ పరిధిలోని భూములు వరంగల్, మహబూబాబాద్ జిల్లాల అటవీ సరిహద్దులో ఉన్నాయని, వారికి గతంలో ఆర్‌ఓఎఫ్ ఆర్ పట్టాలు రాలేదని, ఆ రైతుల అప్లికేషన్లు తీసుకొని మంజూరు చేయాలన్నారు. తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు.
రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలి
నెహ్రూసెంటర్: రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం ఆయన సందర్శించి పరిశీలించారు. వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న సౌకర్యాలు, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమావేశం నిర్వహించారు.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
జాటోతు హుస్సేన్‌నాయక్