
దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులు కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. పరిష్కారం నోచుకోకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. వినతుల విషయంలో నిరక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. మొత్తం 85 వినతులు అందజేశారు. ఎక్కువగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని వినతులు ఇచ్చారు. కార్యక్రమంలో డీసీఓ వెంకట్వేర్లు, సీపీఓ సుబ్బారావు, డీపీఓ హరిప్రసాద్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
కొన్ని వినతులు పరిశీలిస్తే..
● జిల్లాలో మూతబడిన పాఠశాలలను తెరవాలని జాయింట్‌యాక్షన్ కమిటీ స్టేట్ కో కన్వీనర్ మైస శ్రీనివాసులు, జిల్లా కన్వీనర్ మామిడాల సత్యనారాయణ వినతిపత్రం అందజేశారు. 144 పాఠశాలలను మూసివేశారని, ఇందులో 123 గిరిజన తండాల్లో ఉన్నాయని, అధికారులు ఆలోచించి ఆ పాఠశాలలను పునఃప్రారంభించాలని కోరారు.
● కురవి మండలం నల్లెల గ్రామానికి చెందిన ఖాజాపాషా అనే దివ్యాంగుడు అర్హులకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నారని వినతిపత్రం అందజేశాడు.
● బయ్యారం మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు శ్రీను తన తల్లి పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, అయితే వయసు 57 సంవత్సరాలు దాటిందని తన తల్లి పేరు తొలగించారని, తమను అర్థం చేసుకుని ఇల్లు మంజూరు చేయాలని వినతి ఇచ్చాడు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
ప్రజావాణిలో 85వినతుల స్వీకరణ