
కష్టపడేవారికి తగిన గుర్తింపు
మహబూబాబాద్ రూరల్: కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడేవారికి తగిన గుర్తింపు ఉంటుందని టీపీసీసీ పరిశీలకులు కూచన రవళిరెడ్డి, పొట్ల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత, నిర్మాణ సన్నాహక సమావేశం సోమవారం నిర్వహించారు. ముందుగా కాంగ్రెస్ బ్లాక్, మండల, అర్బన్, గ్రామ, వార్డు కమిటీ అధ్యక్ష పదవుల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలమైన పునాది అని, అలాగే పార్టీ బలంగా ఉంటేనే కార్యకర్తలు బలంగా ఉంటారన్నారు. మహిళలకు కూడా పార్టీ పదవుల్లో సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. ఒక నియమావళిని రూపొందించి దానికి అనుగుణంగా కమిటీలను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజ్మీరా సురేశ్, ఎండీ.ఖలీల్, బోడ రవి, మిట్టకంటి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.