మహబూబాబాద్ రూరల్: లక్ష్మీనృసింహుడి జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మహోదయ నగర్ కాలనీలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయంలో ఆదివారం స్వామివారు, అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పోతురాజు రాజు, బూర వెంకన్న, భక్తులు పాల్గొన్నారు.
అధికారుల పర్యవేక్షణలో ధాన్యం కొనుగోళ్లు
అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి
మహబూబాబాద్: ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, రవాణా జరుగుతోందని అదనపు కలెక్టర్ వీర బ్రహ్మచారి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట లారీలను సిద్ధంగా ఉంచి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాంటా వేసి ధాన్యాన్ని తరలిస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అధికారులంతా సమన్వయంతో పని చేస్తున్నారని చెప్పారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ధాన్యం రవాణాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆదేశాలు జారీ చేస్తూ, పర్యవేక్షిస్తున్నామన్నారు.
పెండింగ్ వేతనాలు చెల్లించాలి
నెహ్రూసెంటర్: మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొత్తపల్లి రవి, బిల్లకంటి సూర్యం ఆదివారం అన్నా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... పరిసరాలను పరిశుభ్రం చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. కార్మిక ఉద్యోగులకు నెలనెలా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సింగరేణి సీఎండీ పూజలు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని తెలంగాణ సింగరేణి సంస్థ సీఎండీ బలరాంనాయక్, రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు గోవిందహరి వేర్వేరుగా దర్శించుకున్నారు. ఆదివారం ఆయన ఆలయానికి రాగా అర్చకులు మర్యాద పూర్వక స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేకం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనం చేశారు. ఆలయ ఈఓ ఎస్.మహేష్ స్వామివారి శేషవస్త్రాలతో వారిని సన్మానించగా అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదం అందజేశారు.

వైభవంగా లక్ష్మీనృసింహుడి కల్యాణం