
పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మించాలి
గార్ల: పాకాల ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఏటివద్ద సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలను సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి ప్రారంభించారు. ఈ దీక్షలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 40ఏళ్లుగా పాకాల ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మా ణం చేపట్టాలని రాంపురం, మద్దివంచ పంచాయతీల ప్రజలు ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేపట్టినా పాలకులు, అధికారుల్లో చలనం రావడం లేదన్నారు. పాకాల ఏటిపై బ్రిడ్జి లేకపోవడంతో ప్రతీఏటా వర్షాకాలంలో సుమారు 20 గ్రామాల ప్రజలు వరద ఉధృతితో మండల కేంద్రానికి రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు కట్టెబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేంత వరకు అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని స్పష్టం చేశారు. దీక్ష శిబిరాన్ని బీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం, టీజేఎస్, టీవీవీ పార్టీల నాయకులు సందర్శించి తమ సంఘీభావం ప్రకటించారు. దీక్షలో నాయకులు జంపాల వెంకన్న, రాగం రమేశ్, జనార్దన్, మాగం లోకేష్, రమేశ్, నాగేష్, వీరన్న, వెంకటేష్ పాల్గొన్నారు.