
పుష్కర పనుల్లో నాణ్యత పాటించాలి
కాళేశ్వరం: సరస్వతీనది పుష్కరాల పనుల్లో నాణ్యత పాటించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశించారు. ఆదివారం మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతీ(వీఐపీ)ఘాట్ సరస్వతీమాతా విగ్రహం, జ్ఞానదీపం, నదిలో భక్తుల స్నానమాచరించే ప్రదేశం, టెంట్ సిటీ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం టెంట్‌సిటీలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని, మీరే జవాబు చెప్పాలన్నారు. గ్రామం మొత్తాన్ని విద్యుద్దీకరణతో ముస్తాబు చేయాలన్నారు. 12 రోజులు పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పిండ ప్రదాన భవనం అసంపూర్తిగా ఉందని దేవాదాయ ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు హారతి కార్యక్రమాన్ని వీక్షించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు నదిలోకి స్నానాలకు వెళ్లడానికి తాత్కాలిక రహదారి ఏర్పాటుతోపాటు క్వియర్ మ్యాట్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా బారికేడ్స్, ప్రమాద హెచ్చరికల బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. నది వద్ద 50 మంది గజఈతగాళ్లను అందుబాటులో ఉంచి, నాటుపడవలను సిద్ధంగా ఉంచాలన్నారు. మొదటిసారి కాళేశ్వరంలో టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హారతి కార్యక్రమం పర్యవేక్షణకు దేవాదాశాఖ నుంచి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవానికి వస్తున్నారని, అలాగే తదుపరి రోజుల్లో గవర్నర్, రాష్ట్ర మంత్రులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మహదేవపూర్ నుంచి వీధిదీపాలు ఏర్పాటుతో పాటు డివైడర్లు మధ్యలో స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌కు సూచించారు. రహదారులకు మరమ్మతులు నిర్వహించాలని, ఎక్కడా గుంతలు ఉండొద్దని ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల అధికారులను ఆదేశించారు. తాత్కాలిక బస్టాండ్ వద్ద తాత్కాలిక లైటింగ్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పనుల్లో నాణ్యత పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని కాంట్రాక్టర్లును హెచ్చరించారు. ప్రత్యేకాధికారులు స్థానికంగా ఉండి పనులను పర్యవేక్షించాలని తెలిపారు. నిమిషం కూడా కరెంట్ కట్ కావొద్దని, కాటారం, బీరసాగర్ నుంచి విద్యుత్ సరఫరా తీసుకోవాలన్నారు. భక్తులకు ప్రతీ రోజు అన్నదానం చేయాలని స్పష్టం చేశారు. పుష్కరాలు దగ్గర పడుతున్న సమయంలో ఎందుకు స్లాబు వేశారని, పని ఎలా అయిపోతుంది చెప్పండంటూ దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులను ప్రశ్నించారు. స్లాబ్ చేయకుండా ఉండాల్సిందని భక్తులు నదిలోకి ఎలా వెళ్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు, సింగరేణి సీఎండీ బలరాంనాయక్, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, దేవాదాయ శాఖ ఆర్‌జేసీ రామకృష్ణారావు, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్‌కలెక్టర్ మ యాంక్ సింగ్, ఈఓ మహేశ్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నదిలో బోట్లు తిప్పేందుకు
అవకాశం ఇవ్వాలి..
కాళేశ్వరం: కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల్లో త్రివేణి సంగమంలో బోట్లు తిప్పేందుకు అవకాశం ఇవ్వాలని మంత్రి శ్రీధర్‌బాబును స్థానిక గంగ పుత్రులు వేడుకున్నారు. మంత్రి ఆదివారం కాళేశ్వరానికి రాగా తమ జీవనోపాధి గురించి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరేకు గంగ పుత్రులకు అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. మంత్రి వెంట సింగరేణి సీఎండీ బలరామ్‌నాయక్, ఇతర అధికారులు ఉన్నారు.
గ్రామం మొత్తం విద్యుద్దీపాలు
ఏర్పాటు చేయాలి
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ
మంత్రి శ్రీధర్‌బాబు
పుష్కర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష