
పూర్వం గుహలో సరస్వతి అమ్మవారు..
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధదేవాలయం శ్రీసరస్వతి అమ్మవారు పూర్వం సొరంగలోని ఓ గుహలో ప్రతిష్ట చేసి ఉండేదని పురాణాల ద్వారా తెలిసింది. సొరంగ మార్గంలో వెళ్లి అమ్మవారిని దర్శించుకునేవారట. ఆ కాలంలో విద్యుత్ వెలుగులు లేకపోవడంతో సూర్యరశ్మి, నూనె దీపాల వెలుగుల్లో వెళ్లి దర్శించుకునేవారు. ఆ అమ్మవారి విగ్రహం భిన్నమై, ఆలయం శిథిలావస్థకు చేరింది. శృంగేరి పీఠాధిపతులు, శారదపీఠాధిపతులు దక్షిణ భారతదేశం పర్యటనలో కాళేశ్వరం మీదుగా వచ్చినప్పుడు గ్రామస్తుల ద్వారా తెలిసినట్లు ఆధారాలు ఉన్నాయి. 1976 తర్వాత జీర్ణోద్దరణ జరిగిన అనంతరం అప్పటి రవాణాశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు చొరవతో దినదినాభివృద్ధి చెందుతోంది. నిత్యం పూజలు చేస్తున్నారు. ప్రతీ వసంత పంచమి రోజు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. కాగా, దేశంలో సరస్వతి ఆలయాలు కాళేశ్వరంలోని మహాసరస్వతి, బాసరలోని జ్ఞానసరస్వతి, కాశ్మీర్‌లోని బాలసరస్వతి విశిష్టత కలిగినవి. ఈ క్రమంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.