
పనులు శరవేగంగా చేపట్టాలి
● కలెక్టర్ రాహుల్‌శర్మ
కాళేశ్వరం : కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాల పనులు శరవేగంగా చేపట్టాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. ఈమేరకు శనివారం ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి ఘాట్, సరస్వతి మాతావిగ్రహం, జ్ఞాన దీపం, స్టాళ్లు, పుష్కర స్నానాలు ఆచరించే నది ప్రాంతం, పారిశుద్ధ్య ఏర్పాట్లు, విద్యుత్ సరఫరా, తాగునీరు, మరుగుదొడ్ల ఏర్పాట్లు పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాలకు సమయం తక్కువగా ఉందని, పనులు శరవేగంగా చేపట్టాలని అధికారులు, కాంట్రాక్టర్లును ఆదేశించారు. భక్తులు నదిలోకి వెళ్లకుండా ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు వేగంగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉందని తెలిపారు.