
డిగ్రీ ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యాయత్నం..
● చికిత్స పొందుతున్న విద్యార్థి మృతి
కేసముద్రం: డిగ్రీ ఫెయిల్ అయ్యాననే మనస్థాపంతో ఓ విద్యార్థి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం భుక్యారాంతండా జీపీ శివారు అవుసలితండాలో చోటుచేసుకుంది. ఎస్సై రవికిరణ్ కథనం ప్రకారం..తండాకు చెందిన జాటోత్ వాల్యా, సువాలి దంపతుల చిన్నకుమారుడు మోహన్(22) వరంగల్‌లోని ఓ కాలేజీలో డిగ్రీ(ఎంపీసీఎస్) చదివాడు. ఈ క్రమంలో వార్షిక పరీక్షలు రాయగా, ఇటీవల ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ఫెయిల్ అయ్యాడు. దీంతో అప్పటి నుంచి మనస్తాపం చెందుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 6న ఇంటికి వచ్చిన మోహన్ తమ వ్యవసాయ భూమి వద్ద గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు మానుకోట జనరల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
యథావిధిగా కేయూ డిగ్రీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆది లాబాద్ జిల్లాలో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ , బీసీఏ, బీ ఒకేషనల్ తదితర కోర్సుల 2, 4, 6 సెమిస్టర్ పరీక్షలు, అలాగే డిగ్రీ కోర్సుల బ్యాక్‌లాగ్ మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 14 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్ శనివారం తెలిపారు. పరీక్షలు వాయిదాపడినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమన్నారు. ఇటీవల ప్రకటించిన డిగ్రీ కోర్సుల ఆయా సెమిస్టర్ల పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరగనున్నాయన్నారు. కాగా, ఫీజులు చెల్లించిన కాలేజీల విద్యార్థులకే పరీక్షలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ఇంకా పరీక్ష ఫీజులు చెల్లించని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నారు. ఆయా కాలేజీల యాజమాన్యాలు ఈనెల 12వతేదీ వరకు పరీక్ష ఫీజులు చెల్లిస్తాయని భావిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు పరీక్షలు వాయిదా వేశామని, ఇక వాయిదావేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు సంబంధిత కేయూ వెబ్‌సైట్‌లో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీచేస్తామని పేర్కొన్నారు.

డిగ్రీ ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యాయత్నం..

డిగ్రీ ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యాయత్నం..