
ఎడ్లబండ్ల నుంచి హెలికాప్టర్ దాకా..
కాళేశ్వరం : కాళేశ్వరం.. గతంలో కాకులు దూరని కారడవి. దండకారణ్యం కావడంతో గతంలో ఎలాంటి రవాణా సదుపాయాలు ఉండేవి కావు. ఈక్రమంలో 1982లో జీర్ణోద్ధరణ జరిగిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతోంది. అప్పుడు ఆర్టీసీ బస్సులు దిక్కు. ప్రైవేట్ వాహనాలు కూడా అంతంతే. భక్తుల సంఖ్య కూడా తక్కువే. 2013లో జరిగిన సరస్వతీపుష్కరాల వరకు కాళేశ్వరానికి ఆర్టీసీ బస్సుల్లో భక్తులు తరలివచ్చేవారు. ఈ సమయంలో బస్టాండ్ నుంచి గోదావరి ఘాట్ వరకు వెళ్లాలంటే ఎడ్ల బండ్లే దిక్కు. లేదంటే కాలినడకనే శరణ్యం. ఈ క్రమంలో 2016 డిసెంబర్‌లో మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి నిధులు రూ.250 కోట్ల వ్యయంతో గోదావరిపై అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణం చేపట్టింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య రవాణా పెరిగింది. దీనికితోడు మంచిర్యాల జిల్లా రాపన్‌పల్లి, సిరొంచ మధ్య రూ.170 కోట్ల వ్యయంతో ప్రాణహిత నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో మరో అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణంతో రవాణా మరింత పెరిగి కాళేశ్వరాలయానికి భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం వేల సంఖ్యలో ప్రైవేట్ వాహనాలు రయ్‌రయ్ మంటూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ నెల15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టితో జాయ్‌రైడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కన్నెపల్లిలో మూడు, సీఎం తరహా వీవీఐపీల కోసం ఘాట్ సమీపంలో ఒకటి హెలిపాడ్‌లు సిద్ధం చేశారు. దీంతో ఎడ్లబండ్లపై తిరిగిన భక్తులు ఈసారి జాయ్‌రైడ్స్‌తో (హెలికాప్టర్) ఎంజాయ్ చేయనున్నారు. కాలినడక, ఎడ్లబండ్లు, ఆటోలు, కార్లలో ప్రయాణం చేసిన ప్రయాణికులు ప్రస్తుతం హెలికాప్టర్లలో చక్కర్లు కొట్టనున్నారు.
అంతర్రాష్ట్ర వంతెనలతో కాళేశ్వరానికి పెరిగిన రవాణా