
టీజీఆర్‌జేసీ సెట్ ప్రశాంతం..
విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షి యల్ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం 2025–2026లో ప్రవేశాలకు గాను శనివారం నిర్వహించిన టీజీఆర్‌జేసీ సెట్ ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో 32 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. మొత్తం 7,564 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సిండగా అందులో 6,360 మంది (84.08శాతం) హాజరుకాగా 1,204మంది గైర్హాజరయ్యారని టీజీఆర్‌జేసీ సెట్ హనుమకొండ జిల్లా కోఆర్డి నేటర్ కె. ఇందుమతి తెలిపారు. ఎంపీసీ గ్రూప్‌నకు 4,708 మంది విద్యార్థులకుగాను 3,986 మంది, బీపీసీ గ్రూప్‌నకు 2,668 మందికిగాను 2,237మంది, ఎంఈసీ గ్రూప్‌నకు 188 మందికిగాను 137మంది హాజరయ్యారని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ పరీక్ష కేంద్రాన్ని టీజీఆర్‌జేసీసెట్ జిల్లా కోఆర్డినేటర్ కె.ఇందుమతి, జిల్లా విద్యాశాఖ ఏసీజీఈ భువనేశ్వరి సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు.
ఆ పరీక్ష కేంద్రం
మార్పుతో ఇబ్బందులు
టీజీఆర్‌జేసీసెట్‌కు హనుమకొండలో 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో కిషన్‌పురలో చైతన్యహైస్కూల్‌లో ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఆ పరీక్ష కేంద్రం పేరుమీదే హాల్‌టికెట్లు జారీ అయ్యాయి. అయితే ఆ పరీక్ష కేంద్రంలోని విద్యార్థులకు హనుమకొండలోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో పరీక్ష కేంద్రంగా మార్పుచేశారు. ఇది తెలియని కొందరు విద్యార్థులు చైతన్య హైస్కూల్ వద్దకు వచ్చారు. ఇక్కడ కాదు ఆక్స్‌ఫర్డ్ స్కూల్ పరీక్ష కేంద్రానికి వెళ్లాలని తెలపడంతో ఆయా వారు కొంత ఇబ్బందులు పడ్డారు. కాగా, అనివార్య పరిస్థితుల్లోనే ఆ పరీక్ష కేంద్రాన్ని మార్పు చేశామని టీజీఆర్‌జేసీ సెట్ జిల్లా కోఆర్డినేటర్ కె.ఇందుమతి తెలిపారు.
84.08 శాతం మంది విద్యార్థుల హాజరు