
వారసులు తిరగబడుతున్నారని ఆందోళన
హసన్‌పర్తి: ‘20 ఏళ్ల క్రితం ప్లాట్లు కొనుగోలు చేశాం. పట్టాదారులు వచ్చి రి జిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసిన వా రు లేరు. వారి వారసులు మాత్రం భూ మి అమ్మలేదని తిరుగబడుతున్నారు’ అని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు శనివారం బాధితులు కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. భీమారం శివారు సర్వే నంబర్ 520, 521, 522, 523, 524లో 20 ఏళ్ల క్రితం పట్టాదారులు ఓ వెంచర్ చేశారు. అందులో ఆయా ప్రాంతాలకు చెందిన కింది స్థాయి ఉద్యోగులు, చిరువ్యాపారులు 75 ప్లాట్లు కొనుగోలు చేశారు. 51 ప్లాట్లను పట్టాదారుల నుంచి ఖరీదు చేయగా, మరో 24 ప్లాట్లు జీపీఏ పొందిన వడ్డేపల్లికి చెందిన పాండురాల శ్రీదేవి, పాండురాల సంపత్‌కుమార్, జూలైవాడకు చెందిన బూర జంపయ్యల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటి నుంచి ప్లాటుదారులు మోకాపైకి రాలేదు. ఇళ్ల నిర్మాణం కోసం ప్లాట్ల వద్దకు వెళ్తే పట్టాదారుల వారుసులు బొక్క కిరణ్, కట్టెపోగుల కుమార్, సంగాల రమేశ్, సంగాల శంకర్, రేనుకుంట్ల సురేశ్, నమిండ్ల జోసెఫ్, డాక్టర్‌కుమార్, నమిండ్ల థామస్, నమిండ్ల రామస్వామి, ఉదయ్, నమిండ్ల సురేశ్, సందెల రజనీకాంత్ అసలు భూమినే విక్రయించలేదని తిరుగబడుతున్నారని చెప్పారు. వారితో పాటు జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన శ్రీదేవి, సంపత్, బూర జంపయ్య కూడా పట్టాదారులకు సహకరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్లాట్ల వద్దకు వెళ్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెడతామని బెదిరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఖరీదు చేసిన డాక్యుమెంట్లను ప్రదర్శించారు.
న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే..
‘పైసా.. పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేశాం. కూతుళ్ల పెళ్లిళ్లకు పనికొస్తాయమని భావించాం. ఇప్పుడున్న ప్లాట్లు కబ్జాకు గురవుతున్నాయి. న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యలే శరణ్యం’ అని బాధితులు తెలిపారు.