
పొట్టకూటి కోసం వచ్చి మృత్యుఒడికి..
వర్ధన్నపేట : పిడుగుపాటుకు ఓ బిహార్ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మండలంలోని కోనాపురంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. వర్ధన్నపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో కోనాపురంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో బిహార్‌కు చెందిన బిట్టువిండ్(31) హమాలీగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ సమయంలో బిట్టువిండ్ వర్షం పడుతుండగా చెట్టుకిందికి వెళ్లాడు. కొద్ది సమయం తర్వాత సమీపంలో పిడుగు పడడంతో బిట్టువిండ్ అక్కడికక్కడే మృతిచెందాడు. బిట్టువిండ్ కొంతకాలంగా వర్ధన్నపేటలోని ఓ రైస్‌మిల్లులో హమాలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఇటీవల పీఏసీఎస్ ఆధ్వర్యంలో కోనాపురంలో కొనుగోలు కేంద్రం ప్రారంభం కాగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా, బిట్టువిండ్ మృతదేహాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సందర్శించారు. మృతుడి బంధువులకు రూ.15 వేల ఆర్థికసాయం అందజేశారు.
పిడుగుపాటుకు విద్యార్థికి అస్వస్థత
వర్ధన్నపేటలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం ఆరబోసి కుప్పలు చేస్తున్న క్రమంలో సమీపంలో పిడుగు పడడంతో వెంకటేశ్వర తండాకు చెందిన మాడావత్ వెంకన్న కుమారుడు గణేశ్ అస్వస్థతకు గురయ్యాడు. గణేశ్ ఇటీవల పదో తరగతి పాసయ్యాడు. అస్వస్థతకు గురైన గణేశ్‌ను కుటుంబీకులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
పిడుగుపాటుకు బిహార్ యువకుడి మృతి
కోనాపురంలో ఘటన