
సమావేశంలో మాట్లాడుతున్న నారాయణ, పక్కన నాయకులు
● సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
మహబూబాబాద్: రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికమని, దానిని తీవ్రంగా ఖడిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన దీక్షకు నారాయణ సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాజకీయ కుట్రలో భాగంగానే రాహుల్‌గాంధీపై వేటు వేశారని మండిపడ్డారు. ప్రజాకోర్టులో ప్రధాని మోదీకి దండన తప్పదని హెచ్చరించారు. రాహుల్‌గాంధీ విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఉద్యమిస్తామన్నారు.
చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ
నెహ్రూసెంటర్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి నాలుగువేల మంది అమరులయ్యారని, పది లక్షల ఎకరాలను పేదలకు పంచిపెట్టామన్నారు. అంతటి ఘనమైన చరిత్ర, పోరాటాన్ని హేళన చేయడం సరికాదన్నారు. స్వాతంత్య్ర పోరాటం, సాయుధ పోరాటంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న పేదల ఇళ్లను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బి.విజయసారథి, అజయ్‌సారథిరెడ్డి, కర్రె భిక్షపతి, పంజాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.