
అవార్డులు సాధించిన సర్పంచ్‌లతో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు
మహబూబాబాద్: సీఎం కేసీఆర్ ప్రవేశపట్టిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని, తెలంగాణలో ప్రజారంజక పాలన సాగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సతత్ వికాస్ పురస్కార్ జిల్లాస్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, విశిష్ట అతిథులుగా మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్‌పర్సన్ బిందు, కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ హాజరై 27మంది సర్పంచ్‌లకు అవార్డులు అందజేసి సన్మానించారు. అనంతరం మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ... పురస్కారం మరింత బాధ్యతను పెంచుతుందన్నారు. గతంలో సర్పంచ్‌లకు మంజూరైన నిధులు సరిపోయేవి కావని, అరకొర నిధులు తాగునీటికే సరిపోయేవన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మిషన్ భగీరథ పథకంతో తాగునీటికి శాశ్వత పరిష్కారం లభించిందన్నారు. చిన్న గ్రామపంచాయతీలకు సైతం ట్రాక్టర్లు మంజూరు చేయడం వల్ల చెత్త తరలింపు సులువైందన్నారు. ట్రాక్టర్లు జీపీలకు ఆదాయ వనరుగా మారడం మరో అదృష్టమన్నారు. గతంలో గంగదేవిపల్లికే అవార్డులు వచ్చేవని, ప్రస్తుతం చాలా జీపీలకు అవార్డులు వస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా నిధులను సమానంగా కేటాయిస్తుందని, దీంతో పల్లెలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. అవార్డులు పనితనానికి నిదర్శనమన్నారు. దేశమంతా తెలంగాణ వైపే చూసేవిధంగా సమైక్యంగా కృషి చేయడం ఆనందంగా ఉందన్నారు. జిల్లాస్థాయి అవార్డులు సాధించిన 27జీపీల్లో అభివృద్ధికి రూ.72 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. సర్పంచ్‌లు ఖర్చు చేసిన నిధులను త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. జిల్లాలో మహిళల ఆర్థికాభివృద్ధికి అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు