
ప్రజావాణిలో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్ శశాంక
నిద్ర పోతే... బాధ పోతది
తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ శశాంక నిర్వహించిన ప్రజావాణిలో తన బాధను చెప్పుకొనేందుకు ఓ మహిళ వచ్చింది. ఆ సమయంలో ఫిర్యాదుదారులు ఎక్కువగా ఉండడంతో అక్కడే ఉన్న చెట్టు కింద కునుకుతీసింది. ఇది చూసిన పలువురు నిద్రపోతే అన్ని బాధలు పోతాయని చమత్కరించారు.
బయ్యారం: ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించేందుకే మండలస్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం బయ్యారంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు సమాధానం ఇచ్చే బాధ్యత అధికారులపై ఉందన్నారు. కాగా ప్రజావాణిలో 52దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని
● మండలంలోని సింగారం గ్రామానికి చెందిన గుగులోత్ భోజ్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తన కొడుకు సాకటం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. అలాగే జగ్నాతండాకు చెందిన ఇస్లావత్ జాంకీ అనే వృద్ధురాలు తన కొడుకులు సాకటం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు అందించింది.
● బయ్యారం పెద్దచెరువు కాల్వల మరమ్మతులు చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేర్వేరుగా కలెక్టర్‌కు వినతులు సమర్పించారు.
● యాసంగిలో తమకు రావాల్సిన రైతుబంధు డబ్బులు ఇప్పటి వరకు ఖాతాల్లో జమకాలేదని, తమకు వెంటనే డబ్బులు ఇప్పించాలని కలెక్టర్‌కు పలువురు రైతులు దరఖాస్తులు అందజేశారు.
● మండలంలో ఇటుకబట్టీల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా చూడాలని ఇటుకబట్టీల యజమానులు కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. అలాగే ఇటుకబట్టీల వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయని కొందరు రైతులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
● మండలంలోని ఉప్పలపాడు పంచాయతీలో విద్యుత్‌సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థలం కేటాయించడంతో పాటు ఉప్పలపాడులో రహదారిపై ఉన్న స్థూపంను తొలగించాలని సొసైటీ అధ్యక్షుడు మధుకర్‌రెడ్డి కలెక్టర్‌కు విన్నవించారు.
● మండలంలోని పలు గ్రామాల్లో సాగులో ఉన్న గిరిజన, గిరిజనేతర రైతులకు పట్టాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఎస్టీ విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు దరఖాస్తు అందజేయగా, బయ్యారంలో కోతుల, కుక్కల బెడదను నివా రించాలని సేవాలాల్‌సేన ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బిందు, ఆర్డీఓ కొమురయ్య, మండల ప్రత్యేకాధి కారి లక్ష్మీనారాయణ, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.
అందుకే మండలస్థాయిలో ప్రజావాణి
బయ్యారం గ్రీవెన్స్‌లో కలెక్టర్ శశాంక

చెట్టుకింద నిద్రపోతున్న మహిళ