
పాత బజార్‌లో రైల్వేట్రాక్ పక్కన గుట్టలపై వెలసిన గుడిసెలు
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో ప్రతిరోజు గుడిసెలు వెలుస్తున్నాయి. పలు పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో నిరుపేదలు గుడిసెలు వేసుకొని, గూడు కట్టించాలని పోరాటా లు చేస్తున్నారు. దీంతో పట్టణం నలుమూలల ప్రభుత్వ భూముల్లో వేల సంఖ్యలో గుడిసెలు వెలిశాయి. ఆప్రాంతాలు గుడిసెవాసులతో జాతరలా బహిరంగ సభను తలపిస్తున్నాయి. కాగా ప్రభు త్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలని మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ కలెక్టర్ శశాంకకు సూచించారు. ఈమేరకు కలెక్టర్ ఆదేశాలతో సంబంధిత అధికారులకు గుడిసెల తొలగింపు తలనొప్పిగా మారింది. గుడిసెలు తొలగించిన మరునాడే మళ్లీ వేస్తున్నారు. కాగా కురవిరోడ్డులో వెలసిన గుడిసెలను తహసీల్దార్ ఆధ్వర్యంలో సోమవారం తొలగించారు. ఈ మేర కు గుడిసెవాసులు ఆందోళనకు దిగారు. తమకు ప్రభుత్వం స్థలం కేటాయించి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గతంలోనూ..
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండడంతో సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకు ఎర్రజెండా పార్టీల ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకుని కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ (ఎంఎల్)పార్టీలతో పాటు పలు సంఘాలు, చివరకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనూ గుడిసెలు వేస్తు న్నారు. ప్రభుత్వ భూముల్లో నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేస్తున్నారు.
వందల ఎకరాల్లో..
మానుకోట మున్సిపాలిటీలో సర్వే నంబర్ 255, 287, 551లోని ప్రభుత్వ భూమిల్లోని వందల ఎకరాల్లో పేదలు గుడిసెలు వేసుకున్నారు. కురవి రోడ్డులోని సర్వే నంబర్ 255లోని నాలుగైదు ఎకరాల్లో వందల సంఖ్యలో గుడిసెలు వేశారు. అనంతారం రోడ్డు, డబుల్ బెడ్రూం ఇళ్ల పక్కన, గాయత్రిగుట్టపై, దాని చుట్టూ సుమారు 15 ఎకరాల భూమిలో గుడిసెలు వేసుకున్నారు. పాత బజార్‌లో వీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులు, రైల్వే గేట్ పక్కన పలు పార్టీల ఆధ్వర్యంలో వేల సంఖ్యలో గుడిసెలు వేశారు.
గుట్టలు, శ్మశాన వాటికల్లో..
కొత్త బజార్‌లోని చెత్త డంపింగ్‌యార్డు స్థలాలు, ఆ పక్కనే ఉన్న శ్మశాన వాటికల ప్రాంతాల్లో కూడా పలు పార్టీల ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. అలాగే గుట్టలపై కూడా గుడిసెలు వేశారు. గాయత్రి గుట్ట, పాత కలెక్టరేట్ సమీపంలోని గుట్టలు, పాత బజార్‌లోని రైల్వేట్రాక్ పక్కన గల గుట్టలపై కూడా గుడిసెలు వెలిశాయి. కాగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓటుబ్యాంక్‌ను నష్టపోతామని ప్రజాప్రతినిధులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల నాయకుల ఆధ్వర్యంలోనే గుడిసెలు వేసినట్లు ప్రచారం ఉంది.
స్థలాల కొరత..
ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అవసరాలకు స్థలాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కోసం ఇల్లెందు రోడ్డులో 41ఎకరాలు కేటాయించగా, ఆ ప్రాంతంలో సైతం పేదలు గుడిసెలు వేసుకోగా.. ఈనెల 26న కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ నాగభవాని ఆధ్వర్యంలో గుడిసెలను తొలగించారు. అయితే పేదలు మరుసటి రోజే మళ్లీ గుడిసెలు వేసుకున్నారు. దీంతో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాల కోసం భూ సమస్యలు వస్తున్నాయి.
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు
ప్రభుత్వ భూముల్లో వేల సంఖ్యలో పేదలు గుడిసెలు వేశారు. వారిలో స్థానికులు తక్కువగా ఉన్నారు. ఇల్లెందు, బయ్యారం, కురవి మండలంలోని కొత్తూరు, టేకులగూడెం, దంతాలపల్లి మండలవాసులే ఎక్కువగా గుడిసెలు వేశారు. దళారుల మాటలు నమ్మి గుడిసెలు వేసుకుని ఆర్థికంగా నష్టపోవద్దు. అనవసరంగా కేసుల పాలుకావొద్దు. ప్రభుత్వ కార్యాలయాలకే స్థలాల కొరత ఉంది. ప్రజలు అర్థం చేసుకోవాలి.
– నాగభవాని, మానుకోట తహసీల్దార్
మానుకోటలోని ప్రభుత్వ భూముల్లో వెలసిన గుడిసెలు
అన్యాక్రాంతం కాకుండా
చూడాలని మంత్రి ఆదేశాలు
అధికారులకు
తలనొప్పిగా మారిన వ్యవహారం
గుట్టలు, శ్మశాన వాటికల్లోనూ గుడిసెలు
అధికార పార్టీ ఆధ్వర్యంలోనూ..
బీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఇల్లెందురోడ్డులో కేటీఆర్‌కాలనీ ఏర్పాటు చేశారు. అలాగే నర్సంపేట రోడ్డులో 26వ వార్డు సిగ్నల్‌కాలనీలో సుమారు నాలుగు ఎకరాల్లో పేదలు గుడిసెలు వేశారు. ఇలా పలు పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో మానుకోట పట్టణం, శివారులో సుమారు 150ఎకరాల్లో గుడిసెలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కానీ రెవెన్యూ అధికారులు మాత్రం 18ఎకరాల్లోనే పేదలు గుడిసెలు వేసినట్లు చెబుతున్నారు.

ఆందోళన చేస్తున్న గుడిసెవాసులు
