
థావుర్యా(ఫైల్)
గంగారం: తాటి కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లికి చెందిన ధనసరి చిన్న లక్ష్మయ్య(50) చికిత్స పొంది ఇంటికి రాగానే ఆదివారం రాత్రి మృతి చెందాడు. లక్ష్మయ్య వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన భూమిలో ఉన్న తాటి చెట్లను ఆయన ఎక్కి కల్లు తీసి అమ్ముతున్నాడు. అయితే.. ఉగాది పండుగను పురస్కరించుకుని లక్ష్మయ్య వ్యవసాయ భూమిలోని తాటిచెట్లు ఎక్కి కల్లు దింపి ఇంటికి తీసుకొచ్చాడు. ఆయన కుటుంబ సభ్యులు ఐదుగురు కలిసి కల్లు తాగారు. ఈక్రమంలో లక్ష్మయ్య, రాజశేఖర్ తీవ్ర అస్వస్తతకు గురవడంతో హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ఈక్రమంలో రాజశేఖర్ కోలుకోగా.. రోజు రోజుకూ లక్ష్మయ్య ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వైద్యులు బతకడం కష్టమే ఇంటికి తీసుకెళ్లాలని సూచించడంతో లక్ష్మయ్యను ఇంటికి తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి ఇంట్లోనే మృతి చెందాడు. తాటి చెట్టుపై ఉన్న కల్లులో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతోనే తన భర్త మృతి చెందాడని మృతుడి భార్య సారక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు.
చికిత్స పొందుతున్న రైతు..
మహబూబాబాద్ రూరల్: చికిత్స పొందుతూ మహబూబాబాద్ మండలం వేంనూర్ గ్రామ శివారు రామురత్యతండాకు చెందిన బానోత్ థావుర్యా(45) సోమవారం మృతి చెందాడు. థావుర్యాకు మూడెకరాల భూమి ఉంది. అందులో మిర్చి, రెండెకరాల వరి సాగు చేశాడు. పంటల సాగు కోసం రూ.6 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై ఈనెల 10న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు చికిత్స నిమిత్తం ఆయనను మానుకోట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు. మృతుడి భార్య పూలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సీహెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు.
ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఒకరు..
కాశిబుగ్గ: వరంగల్–చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య అబ్బనికుంట మైసమ్మ దేవాలయం సమీపం రైలు ఢీకొని గుర్తు తెలయని వ్యక్తి(40–45) మృతి చెందినట్లు వరంగల్ జీఆర్పీ సీఐ నరేశ్ తెలిపారు. సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా.. ఏదో రైలు నుంచి పడడం వల్ల మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతదేహంపై బూడిద కలర్ ప్యాంట్, వైట్‌కలర్ ఫుల్ షర్ట్ ఉన్నట్లు మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో భద్రపర్చినట్లు వివరాలకు 9441557232లో సంప్రదించాలని సీఐ తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో సోమవారం ముగ్గురు మృతి చెందారు.

ధనసరి చిన్న లక్ష్మయ్య(ఫైల్)