
నీల మృతదేహం
సంగెం: కుటుంబ సమస్యలు, వడగండ్ల వానతో పంట నష్టం ఇవన్నింటితో జీవితంపై విరక్తి చెందిన మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన కొలువుల నీల(52) ఆదివారం రాత్రి కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. నీల కుమారుడికి రెండేళ్ల క్రితం ఏనుగల్లు గ్రామానికి చెందిన రవళికతో వివాహం జరిగింది. ఆమె ఆరోగ్యం బాగలేక రూ.3 లక్షలు చికిత్స కోసం ఖర్చయ్యాయి. కాగా.. కుమారుడికి విడాకులు ఇవ్వాలనుకున్నారు. ఇరు వర్గాల పెద్ద మనుషుల తీర్పు ప్రకారం.. రూ. 20 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. కాగా.. మూడెకరాల పది గుంటల భూమిని కౌలుకు తీసుకుని అందులో మిర్చి, మొక్కజొన్న సాగు చేశారు. ఇటీవలి వడగండ్ల వానకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో కోడలు విడాకుల కోసం రూ. 20 లక్షలు, పంటల కోసం చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేక మనస్థాపానికి గురై ఆదివారం రాత్రి సీతారాంనగర్ సమీపంలో ఎస్సారెస్పీ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై భరత్ తెలిపారు.
మృతదేహం లభ్యం
చెన్నారావుపేట: మండలంలోని సూర్యపేట తండా సమీపంలోని ఎస్సారెస్పీ (డీబీఎం–40) కాలువలో సోమవారం ఉదయం నీల మృతదేహం లభ్యమైంది. అడ్డబాట తండాకు చెందిన రైతు వాల్యనాయక్ కొట్టుకొస్తున్న మృతదేహాన్ని ఆపి తాడు సాయంతో సమీపంలో చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్సై తోట మహేందర్ మృతదేహాన్ని పరిశీలించారు.
తాగొద్దన్నందుకు..
శాయంపేట: మద్యం తాగొద్దని భార్య వారించినందుకు మండలంలోని మందారిపేట గ్రామానికి చెందిన కుక్కల సతీశ్(33) సోమవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సతీశ్ గొర్రెలను కాస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొంత కాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం ఉదయాన్నే మద్యం సేవించిన సతీశ్ ఇంటికి రావడంతోనే అతడి భార్య నాగరాణి గొర్రెలను మేపకుండా మద్యం తాగడం ఎందుకని? మద్యం సేవించవద్దని మందలించింది. నాగరాణి, ఆమె అత్త లింగమ్మ ఇద్దరూ గొర్రెలను మేపేందుకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చే సరికి సతీశ్ ఇంట్లో తాడుతో ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు తెలిపారు.
రైలుకింద పడి యువకుడు..
జనగామ: జనగామ జిల్లా యశ్వంతాపూర్ వాగు వద్ద రైలు కిందపడి భువనగిరి యాదాద్రి జిల్లా ఆలేరు మండలం పటేల్‌గూడెం గ్రామానికి చెందిన కార్తీక్(21) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్నెళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందిన తండ్రిని తలుచుకుంటూ.. మానసిక వేదనకు గురైన కార్తీక్ సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ కానిస్టేబుల్ నరేశ్ తెలిపారు.

కార్తీక్(ఫైల్)