
విద్యార్థుల కేరింతలు
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం మీటర్ సినిమా హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతూల్య రవి సందడి చేశారు. నిట్ వరంగల్‌లో ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వని వేడుకల్లో భాగంగా మీటర్ మూవీ హీరో, హీరోయిన్లు తమ సినిమా ప్రమోషన్లో భాగంగా నిట్‌లో విద్యార్థులతో చిట్‌చాట్ చేసి అలరించారు. స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వని ఫిల్మ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీటర్ సినిమా హీరో, హీరోయిన్ల లెట్స్ టాక్ షోలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా నిట్ విద్యార్థిని మేరి అడిగిన ప్రశ్నలతో పాటు విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ‘మాది వ్యవసాయ కుటుంబం. పవన్‌కళ్యాణ్ స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చా. నేను తిరుపతిలో బీటెక్ చదువుతున్న తరుణంలో నా డ్రెస్సింగ్ చూసి వీడు వరెస్ట్ అని క్లాస్‌లోకి రానిచ్చేవారు కాదు. నాఫ్రెండ్స్ కూడా నన్ను వరెస్ట్ అని అనే వారు. కానీ చాలెంజ్‌గా తీసుకుని బెస్ట్‌గా ఎదిగాను’ అన్నారు.
నిట్ విద్యార్థులు మీటర్ మోగించాలి..
‘నేను తమిళ్ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలో చేస్తున్న తొలి సినిమా మీటర్. ఏప్రిల్ 7న రిలీజ్ అవుతుంది, నిట్ విద్యార్ధులు మీటర్ మోగించాలి. మూవీస్ చేస్తునే బీటెక్ పూర్తి చేసి ఎంటెక్ పూర్తి చేశాను. మీరంతా విద్యకు మొదటి ప్రాధాన్యం ఇచ్చాకే.. ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి’ అని మీటర్ హీరోయిన్ అతూల్య రవి అన్నారు.
కలర్‌ఫుల్‌గా ఎథికల్ నైట్
నిట్ వరంగల్‌లోని టైమ్ స్క్వేర్ ప్లాజా ఆవరణలో సోమవారం రాత్రి స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీ వేడుకల్లో భాగంగా సెంటర్‌ఫర్ వ్యాల్యూ ఎడ్యూకేషన్ క్లబ్ ఆద్వర్యంలో నిర్వహించిన ఎథీకల్ నైట్ కలర్‌ఫుల్‌గా సాగింది. విద్యార్ధులు సంప్రదాయ దుస్తుల్లో ఎత్నిక్‌వేర్ పేరిట నిర్వహించిన ప్రోగ్రాంలో అలరించారు. ఆరోహన్ డ్రామా పేరిట బాలీవుడ్ హీరో షారూఖ్‌ఖాన్, హీరోయిన్ దీపిక పదుకునే నటించిన ఓం శాంతి ఓం చిత్రాన్ని నాటక రూపంలో ఆవిష్కరించారు. ఆకాశంలోకి దీపాలను వదిలి లాంతర్ నైట్‌ను కలర్‌ఫుల్‌గా మార్చారు. నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు దంపతులు విద్యార్థులకు జోష్‌ను అందించేలా చేపట్టిన ర్యాంప్‌వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఉత్సాహం నింపిన సినీ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతూల్య

విద్యార్థులతో మాట్లాడుతున్న సినీ హీరో కిరణ్ అబ్బవరం