
జనగామ: ఆర్టీసీ కార్గో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే తన కొడుకు మృతి చెందాడని తండ్రి కొల్లూరి ఎల్లయ్య జనగామ పోలీస్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశాడు. సీఐ ఎలబోయిన శ్రీనివాస్ తెలిపిన వివరాలు ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం కళ్లెంకు చెందిన కొల్లూరి దుర్గాప్రసాద్ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఈ నెల 25వ తేదీ రాత్రి మృతి చెందాడు. జిల్లా కేంద్రంలో మెకానిక్‌గా పని చేస్తున్న దుర్గాప్రసాద్, జనగామలో నివాసముంటున్న సోదరుడు సాయి వద్దకు బైక్‌పై బయలు దేరాడు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడిపించి, ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొడుకు మృతికి కారణమైన బస్సు డ్రైవర్ దావీద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి ఎల్లయ్య ఫిర్యాదులో పేర్కొన్నాడని, విచారణ చేస్తున్నామని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
డోర్నకల్: స్థానిక బైపాస్ రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడికి గాయాలయ్యాయి. డోర్నకల్ ఎస్సై శ్యాంసుందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సుభాష్‌వీధికి చెందిన పాములపర్తి దక్షిత్(25) తన స్నేహితుడు కరణ్‌కుమార్‌తో కలిసి ద్విచక్రవాహనంపై బైపాస్ రోడ్డు మీదుగా పెట్రోల్‌బంక్ వైపు వస్తుండగా ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిన దక్షిత్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అంకిత్‌కుమార్‌కు గాయాలయ్యాయి. మృతుడి సోదరి సునిత ఫిర్యాదు మేరకు సీఐ వెంకటరత్నం ఆదేశానుసారం కేసు నమోదు చే సుకుని మృతదేహానికి మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టుం నిర్వహించినట్లు తెలిపారు.
హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలోని మేడారంలో ఇటీవల గోవిందరాజుల పూజారి దబ్బగట్ల రవిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. పూజారిని హత్యచేసిన నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును వేగిరం చేశారు. రవి కేసులో అనుమానిత నిందితుడి ఫొటోలను తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు ఆదివారం విడుదల చేశారు. ఫొటోలో ఉన్న వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించి, హత్య కేసు పరిష్కారానికి సహకరించాలని తెలిపారు. సమాచారం కోసం 87126 70112, 87126 70087, 87126 70088 నంబర్ల ద్వారా సంప్రదించాలన్నారు.

పోలీసులు విడుదల చేసిన అనుమానితుడి ఫొటో

దక్షిత్ మృతదేహం