సిరుల పంట కీర దోస..

కీరదోసను కోస్తున్న కూలీలు
 - Sakshi

● రెండు నెలలకే చేతికి.. ● ఏడాదిలో నాలుగుసార్లు సాగు చేసుకునే అవకాశం ● దామెరలో 15 ఎకరాల్లో సాగు ● ఆసక్తి చూపుతున్న రైతులు

శ్రమ తక్కువ –ఆదాయం ఎక్కువ

కీరదోస పంట సాగులో శ్రమ, చీడపీడల బెడద తక్కువ. రెండు నెలల్లోనే ఆదాయం కనిపిస్తుంది. తోటి రైతులు సాగు గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ పంటలో ఇప్పటి వరకు నష్టం లేదు. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు తీగ తెగిపోయి కొంతమేర నష్టం వాటిల్లింది.

– విజయ మహిళా రైతు, దామెర

నీటి వినియోగం తక్కువ

నేను కీరదోస పంటను ఎకరంలో సాగు చేశాను. ఒక ఎకరానికి సరిపడే నీళ్లతో మూడెకరాలకు పారించుకోవచ్చు. దోస తీగలను రక్షించుకుంటే పంట చేతికందినట్టే. ఏడాదిలో నాలుగు సార్లు ఈ పంటను సాగుచేసుకోవచ్చు. నేను ఐదు ఏళ్ల నుంచి సాగుచేస్తున్నాను. 50వేలు విత్తనాల ఖర్చుపోగా సంవత్సరానికి రూ.70వేలు ఆదాయం సమకూరుతుంది.

– ఎడ్ల రవీందర్‌రెడ్డి రైతు, దామెర

ఎల్కతుర్తి: భూమిని నమ్ముకున్న రైతులు ఆ భూమిలో ఏ పంట వేస్తే బాగుంటుందో ఆలోచించాలి. అలా నూతనంగా ఆలోచించిన రైతులకు భూమి సిరుల పంటలను కురిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇదే కోవలో కీరదోస పంట రైతుల పాలిట వరప్రదాయనిగా మారుతుంది. మునుపెన్నడూ లేని విధంగా రైతులు కాస్త తమ పంటల పద్దతిని మార్చి కొత్త పంటల వైపు అడుగులు వేస్తున్నారు. ఆదాయ వనరుగా మారిన కీరదోస పంట సాగుపై ప్రత్యేక కథనం..

రెండు నెలల పంట

కీరదోస కేవలం రెండు నెలల పంట. రెండు నెలల్లోపే కీరదోసలు మార్కెట్‌కు తరలించేంతగా ఎదుగుతాయి. తక్కువ నీటిని వినియోగించుకుని ఎక్కువ లాభాలను ఇచ్చే పంటగా కీరదోస రైతులను ఆకర్షిస్తోంది. రోహిణి కార్తె మొదలు నుంచి ఈ పంటను సాగు చేస్తారు. మరుసటి ఏడాది ఫిబ్రవరి, మార్చితో పంట కాలం ముగుస్తుంది. నీటి సౌకర్యాన్ని బట్టి పంట ఎదుగుదల ఉంటుంది. పంట సాగు కోసం పెద్దగా శ్రమపడాల్సిన పని ఉండదు. విత్తనాలు వేసినప్పటి నుంచి మొక్కలు మొలకెత్తి తీగ పారేంత వరకు పురుగు మందుల వాడకం చాలా తక్కువగా ఉంటుంది. ఎకరాకు సుమారు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. రోజు తప్పి రోజు కాయలను కోసుకోవచ్చు. కాయల సైజు ప్రకారం ధరలు ఉంటాయి. 15ఎంఎం ధర రూ.24, 20ఎంఎం రూ.12, 30ఎంఎంకు రూ.5 చొప్పున ధర చెల్లిస్తారు. కాయ సైజు పెరిగితే ధర తక్కువగా ఉంటుంది. కాయలు మొదలైనప్పటి నుంచి సుమారు 15 నుంచి 20 సార్లు కోత కోసుకోవచ్చు.

దామెరలో 15 ఎకరాల్లో సాగు

మండలంలోని దామెర గ్రామంలో సుమారు 8మంది రైతులు 15 ఎకరాల్లో ఈ ఏడాది కీరదోస పంటను సాగు చేశారు. వీరంతా ఇంతకు ముందు వరి, మొక్కజొన్న, మిరప పంటలను సాగు చేసే రైతులు. ఈ ఏడాది వీరు తమ పంటలో మార్పు చేయాలని ఆలోచించి కీరదోస పంట గురించి తెలుసుకున్నారు. అందులో ఉన్న లాభనష్టాలను బేరీజు వేసుకుని కీరదోస పంటను వేశారు. రెండు నెలల్లోనే ఆదాయం చూపించే కీరదోస పంటకు ఇక్కడి చౌక భూములు అనుకూలంగా ఉండడంతో రైతులు వేసిన పంటలు ఆశించిన స్థాయిలో ఎదిగాయి. ప్రస్తుతం నీటి వసతులు సరిపడా ఉండడంతో పంట రెండు నెలల్లోనే చేతికొచ్చేసింది. పంట వేసిన 30 రోజుల్లో కాత వస్తుంది. మరో 30 రోజులు కాయలను కోసుకునేందుకు వీలు ఉంటుంది.

కంపెనీదే బాధ్యత

దామెరలో కీరదోస విత్తనాలను గ్రీన్‌గ్లోబల్‌ జహిరాబాద్‌ అనే కంపెనీ వారు అందించారు. విత్తనాలు వేసినప్పటి నుంచి కాయలను తరలించేంత వరకు వారిదే బాధ్యత ఉంటుంది. రైతు కేవలం పంట బాగోగులు, నీళ్లు పెట్టడం, కూలీ ఖర్చులు చూసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా చీడపీడలు సోకితే నివారణ చర్యలకు కంపెనీ సూచనలు, సలహాలను అందిస్తుంది. ముందుగా కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం పంట దిగుబడిని లెక్కకట్టి డబ్బులు రైతులకు అందిస్తారు. రెండు నెలల్లో పంట కోసం పడిన శ్రమకు ఫలితం దక్కతుందని రైతులు చెబుతున్నారు. ఇలా తరలించిన కీరదోస కాయలను ఇతర రాష్ట్రాకు ఎగుమతి చేస్తారు. ఆరోగ్య ప్రదాయినిగా నిలిచే ఈ కాయలు తినేందుకు, మందుల తయారీకి ఉపయోగపడుతాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కాయలను రైతుల వద్ద నుంచి జహీరాబాద్‌కు తరలిస్తారు. అక్కడి నుంచి యూఎస్‌ఏ, గల్ఫ్‌ దేశాలకు ఎగుమతి చేస్తారు.

ఆకర్షితులవుతున్న రైతులు

తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడిని ఇచ్చే కీరదోస పంటలపై రైతులు ఇప్పుడిప్పుడు ఆసక్తి చూపుతున్నారు. మండలంలో వల్భాపూర్‌లో మొదలైన ఈ పంట మండలంలోని దామెర, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్‌, వంగర, రంగయ్యపల్లి, ధర్మారం, ఎర్రబెల్లి తదితర గ్రామాల్లోని రైతులు సాగు చేస్తున్నారు. ఎలాంటి రిస్కు లేకపోవడంతో ఈ పంట సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.

Read latest Mahabubabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top