
పాదయాత్రలో పాల్గొన్న సీపీఐ శ్రేణులు
బయ్యారం: ఇనుపరాయి గనులున్న బయ్యారం తెలంగాణకు గుండెకాయలాంటిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపోరుయాత్ర ప్రారంభం సందర్భంగా శనివారం బయ్యారంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. బయ్యారంలో లక్షల కోట్ల విలువైన ఉక్కునిల్వలు ఉన్నాయన్నారు. బయ్యారం గుట్టలో 54 నుంచి 65 శాతం క్వాలిటీ ఉన్న ఇనుము 300 మిలి యన్ టన్నులు, 20 శాతం క్వాలిటీ ఉన్న ఇనుము 200 మిలియన్ టన్నులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని జియాలజికల్ సర్వే అధికా రులు పేర్కొన్నారని తెలిపారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి అవసరమైన ఇనుము, డోలమైట్, నీరు, బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. కాంగ్రేస్ నేత రాహూల్‌గాంధీపై తప్పుడు కేసులు పెట్టి ప్రశ్నించేవారిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ఎన్నికల హామీలు అమలు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపోరుయాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేస్తామన్నారు. తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, రాజిరెడ్డి, విజయ్‌సారధి, రవి, రాజ్‌కుమార్, జ్యోతి, పద్మ తదితరులున్నారు.