
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సమావేశం శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం అంచనాల బడ్జెట్, వార్షిక నివేదికను, అకాడమిక్ స్టాండింగ్ కమిటీ నిర్ణయాలను చర్చించి ఆమోదించినట్లు సమాచారం. పలు అంశాలపై వాడివేడిగానే చర్చ జరిగినట్లు తెలిసింది. ప్రధానంగా కాకతీయ యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ కోడిఫైడ్ సర్వీస్ రూల్స్‌పై చర్చ జరగగా విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వాకాటి కరుణ మిగతా యూనివర్సిటీలో ఎలా ఉన్నాయనేది పరిశీలించాలని, ఆ తరువాత ఆమోదింపచేద్దామని సూచించారని సమాచారం. యూనివర్సిటీ పరిధిలోని ఖమ్మం పీజీ సెంటర్‌లో గతంలో ప్రిన్సిపాల్‌గా పనిచేసిన అయిలయ్యపై పలు ఆరోపణలు రాగా, ఆయన ఉద్యోగ విరమణకు కొంతకాలమే ఉండడంతో చిన్న పనిష్‌మెంటు ఇవ్వాలని నిర్ణయించారని సమాచారం. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్‌కళాశాలలో ఓ మహిళా అసిస్టెంట్ ఆచార్యులు తరచూ ఆబ్సెంట్ అయినట్లు ఆరోపణలు రావడంతో వాటికి వేతనం కట్‌చేయాలని నిర్ణయించారని సమాచారం. కేయూ భూమి వ్యవహారంపై నివేదిక అంశంపై ఎజెండాలో చేర్చలేదు. సమావేశంలో వీసీ రమేశ్, కళాశాల విద్య ఆర్‌జేడీ యాదగిరి, రిజిస్ట్రార్ శ్రీనివాస్ రావు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.
మరోసారి పరిశీలించాక
కోడిఫైడ్ సర్వీస్ రూల్స్
కేయూ పాలకమండలి
సమావేశంలో నిర్ణయం