
సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్ సుధారాణి
కాజీపేట రూరల్: వ్యవసాయ సాగు పద్ధతిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులు వేసే పంటల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సకాలంలో అందించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్‌ఏయూ) విస్తరణ సంచాలకులు డాక్టర్ వి. సుధారాణి అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ బాలవికాస సెంటర్‌లో శనివారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ ఆధ్వర్యంలో మధ్య తెలంగాణ మండల వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా సంఘం ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సుధారాణి హాజరై మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులతో నిత్యం మమేకమై కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వివిధ మాధ్యమాల ద్వారా రైతులకు తెలియజేస్తే అధిక ఆదాయం, దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన సంచాలకులు డాక్టర్ జగన్మోహన్‌రావు మాట్లాడుతూ వివిధ పంటల్లో నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కల్పించడంతో పాటు క్షేత్ర ప్రదర్శనలు నిర్వహించి రైతుల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బలరాం, ఆర్‌ఈఏసీ మెంబర్ టి.రాణప్రతాప్, నాబార్డు ఏజీఎం చంద్రశేఖర్, కమిషనరేట్ జేడీఏ సుజాతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్తలు, వివిధ జిల్లాల అధికారులు, మధ్య తెలంగాణ మండలి శాస్త్రవేత్తలు, అధికారులు, అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు.
పీజేటీఎస్‌ఏయూ విస్తరణ
సంచాలకులు డాక్టర్ సుధారాణి
బాలవికాసలో ముగిసిన రైతు సదస్సు