
మొగుళ్లపల్లి/టేకుమట్ల: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.200 కోట్లతో నూతన పోలీస్‌స్టేషన్(పీఎస్) భవన నిర్మాణాలు చేపట్టడం జరిగిందని హోం శాఖ మంత్రి ఎండీ మహమూద్ అలీ అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లికి వచ్చిన హోం మంత్రికి జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన హోం మంత్రి స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ఎంపీ దయాకర్, డీజీపీ అంజనికుమార్, కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి మండల కేంద్రంలో రూ.2.50 కోట్లతో నిర్మించిన పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం, పలిమెల మండలాల పోలీస్‌స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హోం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో శాంతి భద్రతలు, నక్సలిజం పెరుగుతుందనే అపోహలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోలీస్‌శాఖ పటాపంచలు చేసిందని, దేశంలోనే అత్యుత్తమంగా శాంతి భద్రతలను కాపాడుతూ ఆదర్శంగా నిలిచారన్నారు. రూ.700కోట్లతో ఆధునిక పెట్రోలింగ్ వాహనాలు, డయల్ 100 వ్యవస్థను పటిష్టం చేశారని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించామని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో మహిళా సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 8 సంవత్సరాల్లో రాష్ట్రంలో క్రైం రేట్ తగ్గిపోయిందని, దేశంలో సురక్షిత మహా నగరంగా హైదరాబాద్ నిలిచిందన్నారు. పోలీస్‌స్టేషన్‌ల నిర్వాహణకు రూ.75వేలు, రూరల్ ప్రాంతంలో రూ.50వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.25వేలు అందిస్తున్నామన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, దేశంలో వినియోగిస్తున్న సీసీ కెమెరాల్లో 64 శాతం తెలంగాణ రాష్టానివే అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.2.5 కోట్లతో నిర్మించిన టేకుమట్ల పోలీస్‌స్టేషన్ కార్పొరేట్ స్థాయిలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ కోలేటి దామోదర్, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల జెడ్పీ చైర్‌పర్సన్‌లు జక్కుల శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ సురేందర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా సంక్షేమ అధికారి శైలజ, సీడీపీఓ అవంతి, జెడ్పీటీసీ పులి తిరుపతి రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీలు పొలాల సరోత్తంరెడ్డి, ఆది సునీత రఘు, తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలతో పకడ్బందీ నిఘా
షీ టీమ్స్‌తో మహిళలకు భద్రత
పోలీస్ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్
హోం శాఖ మంత్రి ఎండీ మహమూద్ అలీ
