అలగనూరు.. గట్టెక్కని మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

అలగనూరు.. గట్టెక్కని మరమ్మతులు

May 4 2026 7:25 AM | Updated on May 4 2026 7:25 AM

హామీని నెరవేర్చాలి

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని

నెరవేర్చని టీడీపీ నేతలు

సాగునీరు లేక పొలాలను

బీడుగా పెట్టుకుంటున్న రైతులు

గడివేముల: అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ కట్ట కుంగిపోయినా మరమ్మతులు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందలాది ఎకరాలు బీడుగా మారాయి. మిడుతూరు మండలం అలగనూరు గ్రామం సమీపంలోని కేసీ కెనాల్‌ 119 కి.మీ దగ్గర రిజార్వాయర్‌ నిర్మాణానికి 1987లో రూ.3.06 కోట్లతో పరిపాలన అనుమతులు వచ్చాయి. దీనిని 1993 వరకు ఎవరూ పట్టించుకోలేదు. జైకా నిధులతో కేసీ కెనాల్‌ ఆధునికీకరించే పనుల్లో భాగంగా రూ.59.90 కోట్లతో అలగనూరును చేపట్టారు. పనులు ఆలస్యమైనా 2004లో పూర్తయ్యాయి. రిజర్వాయర్‌ కెపాసిటీ మూడు టీఎంసీలు కాగా.. 2017 –18 ఒక్కచోట కట్ట బలహీన పడి కుంగింది. అప్పటి ప్రభుత్వం కుంగిన ప్రాంతంలో తాత్కాలికంగా ఇసుకసంచులు వేసి నీటిని నిల్వచేశారు. కాలక్రమేణా మరింత బలహీన పడిపోవడంతో రిజర్వాయర్‌లో నీటిని నింపడం ప్రమాదకరంగా మారింది.

రూ.36 కోట్లతో ప్రతిపాదనలు

రిజర్వాయర్‌ కట్టకు 2017లో కుంగినప్పుడే శాశ్వత మరమ్మతులు చేసుంటే బాగుండేది. అయితే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3.12 కోట్లు మంజూరు చేసింది. అయితే కట్ట కుంగిన ప్రాంతం మరింత పెరగడంతో రూ.18 కోట్ల దాకా ఎస్టిమేషన్‌ పంపారు. అంతలోనే ఎన్నికలు రావడంతో నిధులు మంజూరు కాలేదు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కట్ట కుంగిన ప్రాంతాన్ని గత ఏడాది నంద్యాల జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. రివైజ్‌డ్‌ ఎస్టిమేషన్‌ వేసి రూ.36 కోట్లకు ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ఇంతవరకు రిజర్వాయర్‌కు నిధు లు కేటాయిస్తామని చెప్పడమే తప్ప స్పష్టమైన ప్రకటన రాలేదు.

నాటి తప్పిదమే..

2017లోని ప్రభుత్వం చేసిన తప్పిదాలతో కుంగిన వెంటనే మరమ్మతులు చేయలేదు. రిజర్వాయర్‌లో నీరు ఉంటే గడివేముల, బూజునూరు, చిందుకూరు, గడిగరేవుల, కొరటమద్ది, పులిమద్ది గ్రామాలకు చెందిన పొలాల్లో భూగర్భజలాలు వృద్ధి చెందుతాయి. బోర్లతో పంటలు పండించుకునే అవకాశం ఉంది. సాగునీరు రాకపోవడంతో రిజర్వాయర్‌ కింద ఉంటే గ్రామాల్లోని వందలాది ఎకరాలు బీడుగా మారాయి.

రిజర్వాయర్‌లో నీరు నిల్వ లేకుండా పోవడంతో పశువులు, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలి. త్వరగా నిధులు మంజూరు చేయించి మరమ్మతులు చేయిస్తే ప్రజలకు తాగునీరు, పొలాలకు సాగునీరు అందుతుంది.

–సర్వేశ్‌రెడ్డి, ఆళ్లగడ్డ గ్రామం

ఇదీ సమస్య

కోర్టు కేసుల కారణంగా రిజర్వాయర్‌ ఎర్త్‌ బండ్‌ చాలా కాలం పాటు ఆగిపోయింది. లోతైన కొండ గట్టు పోర్షన్‌లో నేల స్థాయి కంటే తక్కువ పొరల కుదింపు జరుగలేదు. ఈ రిజర్వాయర్‌ పనులు జరుగుతున్న సమయంలో గడివేముల నుంచి రోళ్లపాడు గ్రామానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డును తొలగించకుండా, ఎలాంటి ట్రెంచెస్‌ వేయకుండానే నిర్మాణం చేపట్టారనే విమర్శలు ఉన్నాయి. నిపుణుల కమిటీ సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసింది. రోడ్డు ఉన్న ప్రాంతం, గతంలో ఇక్కడ ఉండే చెరువులోకి నీరు వచ్చేందుకు ఉండే వాగు మట్టిని తొలగించక పోవడంతోనే బండ్‌ కుంగిందని తెలుస్తోంది. రిజర్వాయర్‌ లోపల వైపునకు 2.5 కి.మీ నుంచి 2.65 కి.మీ, 2.75 నుంచి 2.85 కి.మీ, 2.9 కి.మీ నుంచి 3.00 కి.మీ, 3.15 నుంచి 3.25 కి.మీ వరకు, పైభాగంలో 2.65 కి.మీ నుంచి 2.75 కి.మీ వరకు బండ్‌ కుంగింది. దిగువ భాగంలో కూడా కొన్ని చోట్ల నీరు సీపేజ్‌ అవుతున్నట్లు అప్పటి ఇంజినీర్లు గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement