పెరిగిన ఎండల తీవ్రత | - | Sakshi
Sakshi News home page

పెరిగిన ఎండల తీవ్రత

May 5 2025 8:46 AM | Updated on May 5 2025 8:46 AM

పెరిగ

పెరిగిన ఎండల తీవ్రత

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం పాణ్యంలో 42.7, బనగానపల్లిలో 42.1, నంద్యాలలో 42, దొర్నిపాడు, గడివేములలో 41.8, బండిఆత్మకూరు, రుద్రవరంలో 41.5, కర్నూలులో 41.4, ఆత్మకూరు, పాములపాడులో 41.3, నందికొట్కూరులో 41.1, డోన్‌లో 41 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఎండలు, వడగాల్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ డీపీఎం అనుపమ తెలిపారు.

ఇన్‌చార్జ్‌ ఎస్పీగా ఆదిరాజ్‌ రాణా

జపాన్‌ పర్యటనకు వెళ్లిన

ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు: ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ విదేశీ పర్యటన నిమిత్తం సెలవుల్లో వెళ్లారు. ఈ నెల 4 నుంచి 14వ తేదీ వరకు జపాన్‌లో పర్యటిస్తారు. పది రోజుల పాటు నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్‌ రాణా ఇన్‌చార్జ్‌ బాధ్యతలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయమే ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ జపాన్‌కు బయలుదేరి వెళ్లారు.

భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకం

కర్నూలు(సెంట్రల్‌): భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌బాషా అన్నారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో ఆదివారం భగరథ మహర్షి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కఠోర శ్రమతో దేనినైనా సాధించవచ్చని భగీరథ మహర్షి నిరూపించడారన్నారు. మహర్షిని యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. గతంలో తాత్కాలికంగా మూసివేసిన హాస్టళ్లను తిరిగి ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. బీసీ విద్యార్థుల కోసం డీఎస్సీ శిక్షణను ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. బీసీ వెల్ఫేర్‌ అధికారి కె.ప్రసూన, యాదవ కార్పొరేషన్‌ డైరక్టర్‌ వెంకటేశ్వరరావు, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రకోటి సదాశివ, డైరక్టర్‌ సత్యన్న, నగర సంఘం అధ్యక్షుడు సత్యన్న తదితరులు పాల్గొన్నారు.

మల్లన్న ఆలయంలోని

హుండీకి కన్నం?

కానుకలు చోరీచేసిన నలుగురు

ఓ ఉద్యోగిపై సస్పెన్షన్‌ వేటు

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల దేవస్థానంలోని మల్లికార్జున స్వామి గర్భగుడిలో ఉన్న హుండీకి నలుగురు మైనర్లు కన్నం వేసినట్లు సమాచారం. ఈనెల 1న ఉచిత దర్శన క్యూలైన్‌ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన మైనర్లు గర్భగుడిలోని రత్నగర్భ గణపతి ఆలయం వద్ద ఉన్న (క్లాత్‌)హుండీని బ్లేడ్‌తో కోసి, అందులో కొంత డబ్బు తీస్తుండగా దేవస్థాన సూపరింటెండెంట్‌ పట్టుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి సుమారు రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది రోజుల నుంచి నలుగురు మైనర్లు దర్శనం పేరుతో ఉచిత క్యూలైన్ల ద్వారా ఆలయంలో తరచూ తిరిగినట్లు వెల్లడైంది. ఈఓ ఆదేశాలతో దేవస్థాన సీఎస్‌ఓ ఫిర్యాదు మేరకు శ్రీశైలం ఒకటో పట్టణ స్టేషన్‌ ఆఫీసర్‌ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. చోరీ విషయమై విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీనియర్‌ అసిస్టెంట్‌ను బాధ్యుడిని చేస్తూ సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీశైలంలో సండే సందడి

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్‌ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి.

పెరిగిన ఎండల తీవ్రత 1
1/1

పెరిగిన ఎండల తీవ్రత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement