
చిప్పగిరిలో భయం.. భయం!
● కొనసాగుతున్న పోలీసు పికెట్
ఆలూరు: ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ నేత లక్ష్మీనారాయణ(60)ను గత నెల 27న హత్య చేయడంతో చిప్పగిరి గ్రామంలో భయం నెలకొంది. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. టీడీపీ నాయకులే హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు వస్తున్నాయి. చిప్పగిరిలో ప్రజలకు రక్షణ కల్పిస్తూ పోలీసులు పికెట్ కొనసాగిస్తున్నారు. గుంతకల్లు నుంచి చిప్పగిరికి గత నెల 27న లక్ష్మీనారాయణ ఇన్నోవా వాహనంలో బయలు దేరగా గుంతకల్లు రైల్వేబ్రిడ్జి వద్ద టిప్పర్‌తో ఢీ కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య కేసును పూర్తిస్థాయిలో విచారించేందుకు ఏఎస్పీ హుసేన్‌పీరా నియమించగా.. ఐదు పోలీసుల బృందాలుగా ఏర్పడి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో విచారణ సాగిస్తున్నారు. గ్రామంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య నేతృత్వంలో ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డి, పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. గ్రామంలో 10 నుంచి 15 మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారని, ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్‌ఐ సతీష్ కుమార్ తెలిపారు.