
అహోబిలేశుని సన్నిధిలో రాష్ట్ర అటవీ సెక్రటరీ చలపతిరావు
ఆళ్లగడ్డ: రాష్ట్ర అటవీశాఖ సెక్రటరీ చలపతిరావు ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. దిగువ అహోబిలం చేరుకున్న చలపతిరావు కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఎగువ అహోబిలం సమీపంలోని సీతల్ బేస్ క్యాంప్ ఆవరణలో అటవీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుణ్యక్షేత్రాలు, గ్రామాల సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు దేవస్థానం నిర్వాహకులు, గ్రామస్తులను సమన్వయంతో అవగాహణ కల్పించాలన్నారు. జీవవైవిద్యం అలరారే నల్లమల అటవీ ప్రాంతంలోని జంతువుల సంరక్షణకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈయన వెంట రుద్రవరం అటవీ రేంజ్ అధికారి శ్రీపతినాయుడు ఉన్నారు.