వెనుకపడుతున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ సివిల్, మెకానికల్‌కే పరిమితం ప్రైవేట్ కాలేజీల్లో ఆధునిక కోర్సులకు 76 శాతం సీట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 132 సివిల్, మెకానికల్ సీట్లు
జిల్లాలో
సీట్లు ఇలా
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఆధునిక కోర్సుల కొరత వెంటాడుతోంది. ఏఐ, ఐటీ, కంప్యూటర్ వంటి ఆధునిక కోర్సులతో ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలు దూకుడు ప్రదర్శిస్తుండగా, కృష్ణా జిల్లాలోని ఏకైక ప్రభుత్వ కాలేజీ మాత్రం సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్‌కే పరిమితమైంది. విద్యార్థులు ఆధునిక కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నా ప్రభుత్వం కోర్సుల పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలోని రెండు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో సివిల్, మెకానికల్ వంటి కోర్సులు లేనేలేవు. మరోవైపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ పూర్తిగా ఈ కోర్సులకే పరిమితం కావడం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ అవసరాలు, కాలానుగుణంగా ప్రభుత్వ పాలిటెక్నిక్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
సీట్ల కేటాయింపు
జిల్లాలో మొత్తం 7 పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా, అందులో ఒకటి ప్రభుత్వ కాలేజీ. మిగిలిన 6 ప్రైవేట్ నిర్వహణలో ఉన్నాయి. 2026–27 విద్యా సంవత్సరానికి మొత్తం 3,587 సీట్లలో 2,720 (76 శాతం) సీట్లు ఆధునిక కోర్సులకు, 867 (24 శాతం) సీట్లు సంప్రదాయ కోర్సులైన సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్‌కు కేటాయించారు. మచిలీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కేటాయించిన 132 సీట్లు కూడా పూర్తిగా ఈ రెండు కోర్సులకే పరిమితమయ్యాయి.
ఆకర్షిస్తున్న ప్రైవేట్ కాలేజీలు
ప్రైవేట్ కాలేజీలు ఆధునిక కోర్సులతో విద్యార్థులను ఆకర్షిస్తున్న తరుణంలో, డిమాండ్ ఉన్న కోర్సులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో లేకపోవడంతో విద్య ప్రైవేట్ రంగంలోనే కేంద్రీకృతమవుతోంది. దీంతో విద్యార్థులు అనివార్యంగా ప్రైవేట్ పాలిటెక్నిక్ వైపు చూస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రధాన ఆధారమైనా ఆధునిక కోర్సులు లేకపోవడం వారి అవకాశాలను పరిమితం చేస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పాలిటెక్నిక్ కాలేజీల్లో ఫీజులు
ప్రభుత్వ, ఎయిడెడ్, పాలిటెక్నిక్ కాలేజీలకు ఫీజులు రూ. 4,700.. ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజీలకు రూ.25,000గా నిర్ణయించారు. రెండో షిఫ్ట్‌ల్లో నిర్వహించే కాలేజీలకు సైతం ఇవే ట్యూషన్ ఫీజులు కొత్త విద్యా సంవత్సరానికి అమలులో ఉంటాయి.
ఎంఫెక్‌తో డిప్లమో త్వరగా పూర్తి
పాలిసెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు మల్టీ పాయింట్ ఎంట్రీ అండ్ క్రెడిట్ సిస్టమ్ (ఎంఫెక్)తో డిప్లొమా కోర్సులను త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది. 10+2, 10+ఐటీఐ, 10+ఇంటర్మీడియెట్ (వృత్తి విద్య) లేదా సైన్స్‌లో మూడేళ్ల డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ విధానానికి అర్హులు. ఇప్పటికే అభ్యసించిన అంశాలకు సంబంధించి నిపుణుల కమిటీ నిర్ణయం మేరకు కొన్ని సబ్జెక్టులకు మినహాయింపులు ఇవ్వబడతాయి. దీంతో అదనపు క్రెడిట్లు ఎంచుకునే అవకాశం ఉండటంతో, విద్యార్థులు సాధారణంగా నిర్దేశించిన కాలానికి ముందే డిప్లొమా కోర్సును పూర్తి చేసుకునే వీలుంటుంది.
సివిల్, మెకానికల్ వంటి సంప్రదాయ కోర్సులకు ఇప్పటికీ మంచి ప్రాధాన్యం ఉంది. పరిశ్రమల అవసరాలకు ఇవి కీలకం. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో మంచి అధ్యాపకులతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఉన్న రెండు కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు 100 శాతం ప్లేస్మెంట్ ఇస్తున్నాం. ఈ ఏడాది పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 70 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చాం. అందరూ ప్రైవేట్ కాలేజీల్లో ఏఐ, కంప్యూటర్స్, ఐటీ కోర్సులు చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. కాలానికి అనుగుణంగా ప్రభుత్వ కాలేజీలో ఆధునిక కోర్సలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది.
– ఎం.జాన్ పీటర్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మచిలీపట్నం
జిల్లాలోని ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 413 సీట్లు డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్, 736 కంప్యూటర్ ఇంజినీరింగ్, 670 ఎలక్రా్టానిక్ అండ్ కమ్యూనికేషన్స్, 554 ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, 132 కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 33 ఆటోమొబైల్ ఇంజినీరింగ్, 50 కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్ వర్కింగ్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ మాత్రం 66 సీట్లు సివిల్, 66 సీట్లు మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులతో పరిమితమైంది.


