హై రిస్క్ ప్రెగ్నెన్సీ.. ప్రభుత్వాస్పత్రిలో డెలివరీ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ముక్కుపచ్చలారని 11 ఏళ్ల బాలికకు వివాహం జరిపించారు. ఆ బాలిక పెళ్లయిన ఏడాదిలోనే గర్భం దాల్చింది. 12వ ఏట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు విజయవాడ నగరంలోనే జరి గింది. విజయవాడకు చెందిన 11 ఏళ్ల బాలికకు, గన్నవరం ప్రాంతానికి చెందిన యువకుడితో ఏడాది క్రితం పెళ్లి చేశారు. బాల్య వివాహాలను అరికడుతున్నామని చెబుతున్న మాతా శిశు సంక్షేమ శాఖ, అంగన్‌వాడీ కేంద్రాలు, బాలికల సంరక్షణ కోసం పని చేస్తున్న సంస్థలు, పోలీసుల కళ్లు గప్పి ఏడాది క్రితం ఈ బాల్య వివాహం చేయించారు. ఆ బాలిక గర్భం దాల్చింది. డెలివరీ సమయంలో హైరిస్క్ కావడంతో నాలుగు రోజుల క్రితం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆ బాలిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఆస్పత్రిలో సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా బాల్య వివాహాలను అరికట్టి.. బాలికలను రక్షించాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల విద్యార్థులు ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ డీకే బాలాజీ సన్మానించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు తిరుమలశెట్టి సిరిచందన (575), బండ్రెడ్జి అక్షయ (571), చిన్నం యదిద్య (565), ఇంటర్మిడియెట్ విద్యార్థిని బెల్లంకొండ అమూల్య (971) ఇతర విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారిత అధికారి జి.రమేష్, వసతి గృహ అధికారులు ఎండీ షహతుల్లా, ఎస్ హనుమ, పి నాగమణి తదితరులు ఉన్నారు.
కిశోర బాలికల సాధికారతకు వేసవి శిబిరాలు
కిశోర బాలికల సాధికారతకు వేసవి శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కిశోర బాలికల వేసవి శిబిరాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ కిశోర బాలికల సమగ్రాభివృద్ధి కోసం మే ఒకటి నుంచి ప్రారంభం కాగా దీనికి సంబంధించిన ప్రచార వాల్ పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. జూన్ 11 వరకు ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. బాలికలు, బాలురకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, ఆరోగ్యమేళా, రక్తహీనత నివారణ తదితర అంశాలపై శిబిరాల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమం అమలులో మహిళా శిశు సంక్షేమశాఖ, విద్యాశాఖ, ఆరోగ్య, పోలీస్‌శాఖలు సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి శిశుసంక్షేమశాఖ పీడీ ఎంఎన్ రాణి, జిల్లా బాలల సంరక్షణాధికారి బి.కిషోర్, నోడల్ అధికారి సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
పెనమలూరు: కానూరులో బాలుడిపై ప్రమాదవశాత్తు వాటర్ ట్యాంక్ పడటంతో మృతి చెందిన ఘటనపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తట్టికోట ధనలక్ష్మి భర్త సాయి తాడేపల్లిలో ఉంటారు. వారికి దేవాన్ష్ (3) కుమారుడు ఉన్నాడు. ధనలక్ష్మి 7 నెలల గర్భిణి. ఆమె కానూరు తులసీనగర్‌లో ఉన్న పుట్టింటికి ఇటీవల వచ్చింది. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి రేకుల షెడ్డులో ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె ఇంటి పనులు చేయడం కోసం కుమారుడిని రేకుల షెడ్డులో పడుకోబెట్టింది. అయితే రేకుల షెడ్డు పై ఉన్న మంచినీటి ట్యాంక్ ఒక్కసారిగాపై నుంచి నిద్రిస్తున్న బాలుడి పై పడింది. అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి అత్యవసర చికిత్స కోసం చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఘటన పై తల్లి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కొంతకాలంగా మరో వ్యక్తితో సహజీవనం
పామర్రు: భర్త తన సోదరులతో కలసి భార్యను హత్య చేసిన ఘటన పామర్రులో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందివాడ మండలం తమిరిశ గ్రామానికి చెందిన డి.ప్రసన్న(30) భర్తతో విభేదాలు రావడంతో కొంతకాలంగా మొవ్వ మండలం నిడుమోలు గ్రామానికి చెందిన అయ్యప్పతో సహజీవనం చేస్తోంది. వీరు పామర్రు గాంధీనగర్‌లోని ప్రతాప్ జూనియర్ కాలేజీ వీధిలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రసన్న భర్త మురళీకృష్ణ , అతని సోదరులు సోమవారం తెల్లవారుజామున పామర్రులోని ఆమె ఇంటికి వెళ్లి హత్య చేశారు. తెల్లవారిన తర్వాత స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు పామర్రు ఎస్‌ఐ జి.శ్రీనివాస్ తెలిపారు. మృతురాలి భర్త మురళీకృష్ణను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


