మచిలీపట్నంఅర్బన్: గ్రామంలోని తాగునీటి చెరువులను కాపాడే వరకు వెనక్కి తగ్గబోమని నందివాడ మండలం పెదలింగాల గ్రామస్తులు స్పష్టం చేశారు. వ్యవసాయ భూములను ఆక్వాజోన్‌లో చేర్చవద్దని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లపై ఊరేగింపుగా చేరుకున్న గ్రామస్తులు పంట పొలాలను చేపల చెరువులుగా మార్చడంతో గ్రామంలో తాగునీరు కలుషితమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చేపల చెరువులు వద్దు, పంట పొలాలే ముద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ డీకే బాలాజీకి వినతి పత్రం అందజేశారు.
తాగునీటి సంక్షోభంలో..
ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, మంచి నీరు చెరువులే గ్రామానికి ఏకై క జీవనాధారమని, అవి నాశనం అయితే మొత్తం గ్రామం తాగునీటి సంక్షోభంలో కూరుకుపోతుందని హెచ్చరించారు. అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఇకపై ఉద్యమ మార్గమే శరణ్యమన్నారు. కోగంటి ఆంజనేయులు, యలవర్తి శివ కేశవ కృష్ణారావు తదితరులు గ్రామంలో చేపల చెరువుల ఏర్పాటుకు సిద్ధమయ్యారన్నారు. పరిసర రైతుల నుంచి ఎన్‌ఓసీలు తీసుకోలేదని, గ్రామ పంచాయతీ పాలకవర్గం కూడా చెరువుల తవ్వకాలపై ఎలాంటి తీర్మానం చేయలేదన్నారు. రొయ్యల పెంపకంలో వినియోగించే అధిక రసాయనాలు తాగునీటిలో కలసి ప్రజలు, జంతువులు అనారోగ్యానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ పరిధిలో సుమారు 400 ఎకరాల సాగుభూమి ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మోహనరావు, ఎన్. రాజ్యలక్ష్మి, మాధవి, మేరీ, గండికోట ఆంజనేయ ప్రసాద్, చింతా కృష్ణబాబు, బాలచందర్, సింగిరెడ్డి సీతారామయ్య, గడ్డం బుజ్జి, పుట్టి సుబ్బారావు, టి. సతీష్, టి. మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
● చేపల చెరువులు తవ్వకంతో విశ్వనాధపల్లి గ్రామంలో తాగునీటికి ముప్పు ఏర్పస్తుందని గ్రామస్తులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ వద్ద కోడూరు మండలం, విశ్వనాథపల్లి గ్రామస్తులు ధర్నా చేశారు.


