ప్రైవేటీకరణతో కృశించిపోతున్న ప్రభుత్వ రంగం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణతో కృశించిపోతున్న ప్రభుత్వ రంగం

Dec 21 2025 12:51 PM | Updated on Dec 21 2025 12:51 PM

ప్రైవేటీకరణతో కృశించిపోతున్న ప్రభుత్వ రంగం

ప్రైవేటీకరణతో కృశించిపోతున్న ప్రభుత్వ రంగం

ప్రైవేటీకరణతో కృశించిపోతున్న ప్రభుత్వ రంగం

కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రభుత్వ కంపెనీల ప్రైవేటీకరణ, పీపీపీ విధానం మూలంగా ప్రభుత్వ రంగం క్రమేపీ కృశించిపోతోందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో కార్మికులు, పేదలు మరింత అభద్రతకు గురవుతున్నారని సుందరయ్య విజ్ఞాన కేంద్రం చైర్మన్‌, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు అన్నారు. విద్యుత్‌, రవాణా, విద్య, వైద్య రంగాలలో ప్రభుత్వం తన బాధ్యతలను వదిలించుకునేందుకు ఎంచుకున్న పీపీపీ విధానం మూలంగా అత్యవసర సేవల్లో నాణ్యత, జవాబుదారీతనం లోపించడంతో పాటు సామాన్య ప్రజానీకం మీద మరింత ఆర్థిక భారం మోపడానికి దారితీస్తుందన్నారు. విజయవాడ గవర్నర్‌ పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నాయకుడు మాకినేని బసవపున్నయ్య 111 వ జయంతి సందర్భంగా ఎం.బి.విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ చైర్మన్‌ పి.మధు అధ్యక్షతన శనివారం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికీకరణ తీరుతెన్నులు–రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అనే అంశంపై స్మారకోపన్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు మార్క్సిజం లెనినిజాన్ని అన్వయించి భారత విప్లవోద్యమానికి సరైన పంథా రూపొందించిన అత్యుత్తమ నాయకుడు బసవ పున్నయ్య అని కొనియాడారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా రాష్ట్రానికి ఒనగూడాల్సిన ప్రయోజనాలు రాజధాని నిర్మాణానికి కేంద్రం విడుదల చేయాల్సి నిధులపై కేంద్ర ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా రాజీ పడుతోందన్నారు. శ్రమ ప్రాధాన్యత పరిశ్రమలకు బదులు పెట్టుబడి ప్రాధాన్యత పరిశ్రమలకు పెద్దపీట వేయడంతో రాష్ట్రాలలోని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఎంవోయూలు, ఆర్భాటపు ప్రకటనలు కట్టిపెట్టి సరైన పారిశ్రామికాభివృద్ధికి నడుం కట్టాలన్నారు. సంస్థాగతంగా ఉన్న ఆటంకాలను అధిగమించేందుకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఎం.బి. విజ్ఞాన కేంద్రం కార్యదర్శి పి.మురళీకృష్ణ, తులసీరావు, స్వరూపరాణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement