అక్రమ కేసులపై న్యాయపోరాటం చేయాలి
గుణదల(విజయవాడ తూర్పు): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా చంద్రబాబు పని చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గుణదలలోని తన కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికార మదంతో కూటమి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నారని, అదేమని అడిగిన తమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల విషయంలో లీగల్ సెల్ నాయకులు న్యాయ పోరాటం చేయాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సాగించిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అవస్థలకు గురవుతున్నారన్నారు. ప్రజల్లో ఇప్పటికే కూటమి పాలనపై వ్యతిరేకత మొదలైందన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం లీగల్ సెల్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు సాయిరామ్, ఉపాధ్యక్షుడు బసవారెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్


